స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ సీఎం కేసీఆర్ డయాలసిస్ రోగులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ పంద్రాగస్టు నుంచి వారికి కూడా ఆసరా పింఛన్ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రత్యేక డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఉచిత ఆర్టీసీ బస్‌పాస్‌లు అందించి అండగా నిలిచిన రాష్ట్ర సర్కార్.. ప్రస్తుతం ప్రతి నెలా రూ.2016 పింఛన్ అందజేయనున్నది. దీంతో పేదవారికి ఎంతో మేలు జరుగనున్నది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా సుమారుగా 400 మంది కిడ్నీ రోగులు ఉంటారు. వీరి కోసం జిల్లాలోని తాండూరు, వికారాబాద్ సర్కారు దవాఖానల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయగా, మెరుగైన సేవలు అందుతున్నాయి. త్వరలో పరిగి, కొడంగల్‌లోనూ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసరా పింఛన్ ప్రకటనపై డయాలసిస్ రోగుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
పరిగి, ఆగస్టు 8: స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ సీఎం కేసీఆర్ మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డయాలసిస్ రోగులకు ఈ నెల 15వ తేదీ నుంచి పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే బోదకాల బాధితులకు సర్కారు పింఛన్ ఇస్తుండగా కొత్తగా డయాలసిస్ చేయించుకునే వారికి కూడా పింఛన్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అందుకు అనుగుణంగా డయాలసిస్ చేయించుకునే వారి వివరాలను అధికారులు సేకరించనున్నారు. దీంతో కిడ్నీ సంబంధిత రోగులకు ఎం తో మేలు జరుగనున్నది. ఇప్పటికే వారికి ఆర్టీసీ బస్‌పాసులను సైతం ప్రభుత్వం అందజేసింది.
రెండు కేంద్రాల్లో డయాలసిస్ సేవలు
వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్ సర్కారు దవాఖానల్లోని డయాలసిస్ కేంద్రాల్లో కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి. వికారాబాద్‌లోని కేంద్రంలో ఐదు బెడ్లు, ఐదు డయాలసిస్ యంత్రాలున్నాయి. అక్కడ ప్రతిరోజూ ఐదు షిప్టుల్లో 24 గంటలపాటు రోజుకు 25 మంది చొప్పున రోజు విడిచి రోజు 50 మందికి డయాలసిస్ సేవలను సిబ్బంది అందిస్తున్నారు. అదేవిధంగా తాండూరులోని జిల్లా దవాఖానలో ఎనిమిది డయాలసిస్ యంత్రాలతో ప్రతిరోజూ నాలుగు షిప్టుల్లో సిబ్బంది సుమారు 36 మంది వరకు రోజు విడిచి రోజు కలిపి మొత్తం 72 మందికి డయాలసిస్ చేస్తున్నారు. వారితోపాటు రెండు కేంద్రాల్లో కలిపి దాదాపుగా 20 మంది వరకు డయాలసిస్ కోసం నిరీక్షిస్తున్నట్లు సమాచారం.
పలువురు వెయిటింగ్లో ఉం టుండటంతో వారికోసం తాండూరులో రెండు అదనపు బెడ్లు, యంత్రాలు, వికారాబాద్‌లో మూడు అదనపు బెడ్లు, యంత్రాలను అధికారులు త్వరలో ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు పరిగి, కొడంగల్ సర్కారు దవాఖానల్లోనూ కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. సాధ్యమైనంత త్వరగా ఈ రెండు సెంటర్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం మహబూబ్‌నగర్, హైదరాబాద్‌తోపా టు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. మరికొందరు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో మరో రెండు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటైతే రోగులకు ఇబ్బందులు తప్పుతాయి.
డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు..
స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ రోగులకు తీపి కబురు అందించింది. వారికి ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే బోదకాల బాధితులకు పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం డయాలసిస్ రోగులకు కూడా నెలకు రూ. 2016 పింఛన్ ఇవ్వనున్నది. వికారాబాద్ జిల్లాలో సుమారు 300 నుంచి 400 వరకు డయాలసిస్ రోగులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సర్కారు దవాఖానల్లో డయాలసిస్ చేయించుకునే వారితోపాటు నగరంలో, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ దవాఖానల్లో డయాలసిస్ చేయించుకుంటున్న వారికి కూడా పింఛన్ అందనున్నది. ఇప్పటికే డయాలసిస్ రోగులకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుపాస్ సదుపాయాన్ని కల్పించింది. పింఛన్ అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో డయాలసిస్ రోగుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
డయాలసిస్ రోగులకు ఎంతో మేలు
పరిగి, కొడంగల్ సర్కారు దవాఖానల్లోనూ కిడ్నీ రోగు ల కోసం డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయం. దీని ద్వారా రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ రోగులకు తప్పుతుంది. సమయం కూడా వృథాకాదు.
-లక్ష్మయ్య, వికారాబాద్
ప్రభుత్వానికి రుణపడి ఉంటా..
రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు అందించడం చాలా మంచి విషయం. మాకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్యుల కష్టాలు తెలిసిన వ్యక్తి. పరిపాలనలో ఆయనకు ఎవరూ సాటి రారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-నారాయణ, తాండూరు డయాలసిస్ రోగి
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
డయాలసిస్ రోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 2016 పింఛన్ ఇస్తామని ప్రకటించడం సంతోషకరం. రోగుల కష్టాలు తెలుసుకుని పింఛన్ మంజూరుకు చర్యలు చేపట్టిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-మాణయ్య, వికారాబాద్