రంగారెడ్డి, ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భజలాలు పైపైకి వచ్చాయి. గత పదిహేను రోజులుగా వరుసగా జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలతో రికార్డు స్థాయిలో భూగర్భజలాలు పెరుగడం గమనార్హం. గత నెలతో పోలిస్తే 3 మీటర్లకుపైగా భూగర్భ జలాలు పెరిగాయి. గతేడాది జూలై నెలతో పోలిస్తే మాత్రం 0.83 మీటర్ల మేర స్వల్పంగా తగ్గినా భూగర్భజలాలు పైపైనే ఉండటం గమనార్హం. జిల్లాలోని అన్ని మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావడం, చెరువులన్నీ నిండి అలుగు పారుతుండటంతో భూగర్భజలాలు మెరుగుపడినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 385 మి.మీ కాగా .. సాధారణానికి మించి రికార్డు స్థాయిలో 524 మి. మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలోనూ వరుస గా వర్షాలు కురుస్తున్నందున భూగర్భజలాలు మరిం త పైకి వచ్చే అవకాశాలున్నట్లు జిల్లా భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు పెరిగిన దృష్ట్యా ఈ ఏడాది సాగు విస్తీర్ణం క్రమంగా పెరిగే అవకాశాలున్నాయి.
7.08 మీటర్లలోనే సరాసరి భూగర్భజలాలు
జిల్లాలో సరాసరి భూగర్భజలాలు 7.08 మీటర్లలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే నీటి నిల్వల్లో మాత్రం పెద్దగా తగ్గకపోవడం గమనార్హం. వర్షాలు జిల్లావ్యాప్తంగా కురుస్తున్నందున భూగర్భజలాలు మరింత పైకి వచ్చే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నా రు. జిల్లాలోని ఒక్క తలకొండపల్లి మండలంలో మా త్రమే భూగర్భజలాలు అడుగంటిపోయి నీటి ప్రమా ద ఘంటికలు ఏర్పడే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. తలకొండపల్లి మండలంలో జూన్ నెలతో పోలిస్తే 11 మీటర్ల మేర నీటి నిల్వలు అడుగంటిపోయాయి. కందుకూరు మండలం రాచలూరులో 0.89 మీటర్లు, మీర్ఖాన్పేటలో కేవలం 1.73 మీటర్లలోనే భూగర్భజలాలున్నాయి. తలకొండపల్లి మండలంలో 26.85 మీటర్ల లోతులో నీటి నిల్వలున్నాయి. ఎండిపోయిన బావులు, బోరు బావులకు నీటిని మళ్లించడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుం టే భూగర్భజలాలు పెరిగే అవకాశాలుంటాయని అధికారులు సూచిస్తున్నారు.
నీటిని పొదుపుగా వాడాలి
జిల్లాలో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే 3.02 మీటర్లు పెరిగాయి. తలకొండపల్లి మండలం మినహా మిగతా మండలాల్లో నీటి నిల్వలు పైపైనే ఉన్నాయి.. అయినప్పటికీ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ప్రతిఒక్కరూ బాధ్యతగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టినట్లయితే భూగర్భజలాలు అడుగంటిపోయే పరిస్థితి రాకపోవచ్చు.
– రఘుపతిరెడ్డి, రంగారెడ్డి జిల్లా భూగర్భజల శాఖ అధికారి