బొంరాస్పేట, ఆగస్టు 1 : పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని శాస్త్ర సాంకేతిక శాఖ ఇన్స్పైర్ మనక్ అవార్డులను 2010వ సంవత్సరం నుంచి అందజేస్తున్నది. ఉన్నత పాఠశాల స్థాయి నుంచే ప్రతిభను చాటేందుకు అవకాశం కల్పిస్తున్నది. 2022-23 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రేరణ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొవిడ్ కారణంగా రెండేండ్లు ఆన్లైన్లోనే పోటీలు నిర్వహించగా, ఈ ఏడాది ప్రత్యక్షంగా ప్రదర్శనలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థులు తాము తయారు చేసిన ప్రాజెక్టు నమూనా జాతీయ స్థాయికి ఎంపికైతే ఆ విద్యార్థికి రాష్ట్రపతి అవార్డు ఇవ్వడంతోపాటు రూ.లక్ష ఉపకార వేతనంతో పాటు, ఉచితంగా ఇంజినీరింగ్ విద్యను అందిస్తారు.
ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు..
శాస్త్రీయ ఆలోచనలు, పరిశోధనలు, ఆవిష్కరణల వైపు విద్యార్థులను అడుగులు వేయించడమే ఇన్స్పైర్ మనక్ అవార్డుల ప్రధాన లక్ష్యం. ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ప్రయోగాలపై ఆసక్తి, అభిరుచి కలిగిన వారిని ఎంపిక చేస్తారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నమూనాలను రూపొందించేలా ప్రోత్సహిస్తారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చెందిన 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. www.inspireawards. dst.gov.in వెబ్సైట్లోకి వెళ్లి విద్యార్థి పేరు, ఆధార్ నంబర్, చదువుతున్న పాఠశాల, తరగతి, పాఠశాల యూడైస్ నంబర్, బ్యాంకు ఖాతా తదితర వివరాలను నమోదు చేసి పేరును రిజిష్ర్టేషన్ చేసుకోవాలి.
పరిశోధన నమూనాకు సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా వెబ్సైట్లో పొందుపర్చాలి. వాటిని అధికారులు పరిశీలించి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పరిశోధనల నమూనాలను ప్రదర్శించడానికి ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో వచ్చిన నమూనాల్లో ఉత్తమంగా ఉన్న 10 శాతం ప్రదర్శనలను ఎంపిక చేస్తారు. ఎంపిక చేయబడిన విద్యార్థి ఖాతాలో కేంద్ర ప్రభుత్వం రూ.10 వేలు జమ చేస్తుంది. ఈ డబ్బుతో విద్యార్థులు పరిశోధనలకు ఉపయోగించే పరికరాలను కొనుగోలు చేసుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనాలి.
జాతీయ స్థాయికి ఎంపికైతే రూ.లక్ష ఉపకార వేతనం
విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు నమూనా జాతీయ స్థాయికి ఎంపికైతే రూ.లక్ష ఉపకార వేతనంతో పాటు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందిస్తారు. అంతేకాకుండా వీరి ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో పేటెంట్ హక్కులు లభిస్తాయి. గత ఏడాది వికారాబాద్ జిల్లాలో 60 మంది విద్యార్థులు కొత్తదనంతో కూడిన ప్రాజెక్టులను రూపొందించగా దౌల్తాబాద్ మండలం గోకాఫస్లబాద్కు చెందిన దాసరి అశోక్ అనే విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్ లిఫ్టింగ్ మిషన్ జాతీయస్థాయికి ఎంపికై దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.
విద్యార్థులకు మంచి అవకాశం
విద్యార్థులు తమలో ఉన్న కొంగొత్త ఆలోచనలు, సృజనాత్మకతను చాటడానికి ఇన్స్పైర్ అవార్డులు మంచి అవకాశం. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ప్రోత్సహించి మంచి ప్రాజెక్టులు రూపొందించేలా చూడాలి. సెప్టెంబర్ 30 వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలి.
-విశ్వేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి