రంగారెడ్డి, జూలై 28, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ సర్కార్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించడంతోపాటు అదే తరహాలో అన్ని రకాల వసతులను కల్పించేందుకు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ తరహాలో నడుస్తున్న కేజీబీవీల్లో పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌కు ప్రతి ఏడాది కొన్ని స్కూళ్ల చొప్పున అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. కేజీబీవీల్లో బోధనకు అర్హత, అనుభవజులైన వారిని నియమించడంతోపాటు కేజీబీవీల్లో చదివే ఒక్కో విద్యార్థికి ప్రతి నెల రూ.1050లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా కేజీబీవీ పాఠశాలలు
రాష్ట్ర ప్రభుత్వం అటు విద్యా బోధనలోనూ, వసతులను కల్పించడంలోనూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా కేజీబీవీ పాఠశాలలను నిర్వహిస్తున్నది. జిల్లావ్యాప్తంగా 20 కేజీబీవీ పాఠశాలలుండగా మొదట కేవలం పదో తరగతి వరకు బోధన ప్రారంభించగా.. తదనంతరం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఏడాదికి రెండు, మూడు స్కూళ్లను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఫరూఖ్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కేశంపేట, కొందుర్గు, మహేశ్వరం, శంషాబాద్, శంకర్పల్లి కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ వరకు బోధన జరుగుతున్నది. ఈ విద్యా సంవత్సరం మంచాల, కొత్తూరులోని కేజీబీవీల్లోనూ ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం అనుమతులిచ్చింది. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అమలుచేసేందుకు నిర్ణయించిన దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లతోపాటు కేజీబీవీల్లోనూ ఇంగ్లిష్ మీడియంను అమల్లోకి తీసుకువచ్చారు.
కేజీబీవీ స్కూళ్లలో చదివేందుకు పేద విద్యార్థులందరూ ఆసక్తి చూపడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రతి ఏటా కొన్ని స్కూళ్లలో ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వం అనుమతులను మంజూరు చేస్తూ వస్తున్నది. కేజీబీవీలకు ఉన్న డిమాండ్‌తో ప్రతి ఏటా నిర్దేశించిన విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా విద్యార్థులు చేరుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులతో గత రెండు, మూడేండ్లుగా కేజీబీవీల్లో అడ్మిషన్లు పెరుగడం గమనార్హం. కేజీబీవీల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలను అందజేస్తున్నారు. అన్ని కేజీబీవీల్లో డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి తరచుగా ఆరోగ్య పరీక్షలను కూడా చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, నీట్ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. కేజీబీవీల్లోని విద్యార్థులకు సన్నబియ్యంతోకూడిన భోజనంతోపాటు రోజుకో రకమైన టిఫిన్, స్నాక్స్, గుడ్డు, అరటిపండు.. వారానికి ఒకసారి బిర్యానీ అందిస్తున్నారు. అన్ని అర్హతలతోపాటు అనుభవజులైన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులతో విద్యాబోధన అందిస్తున్నారు.
కేజీబీవీల్లో పెరిగిన అడ్మిషన్లు : డీఈవో సుశీంద్రరావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాలలతోపాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో అడ్మిషన్ల కోసం డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలకు మహర్దశ వచ్చింది. కేజీబీవీల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు అధిక మొత్తంలో అడ్మిషన్లకై వస్తుండడంతో పలు స్కూళ్లలో నిర్దేశించిన దాని కంటే సీట్ల సంఖ్యను కూడా పెంచారు. ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని కేజీబీవీల్లోనూ ఇంగ్లిష్ మీడియంలోనే బోధన జరుగుతున్నది.