మొయినాబాద్, జూలై 28 : బ్యాంకుల్లో రుణ సదుపాయం పొందిన మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల మహిళా సమాఖ్య భవనంలో మండల మహిళా సమాఖ్య 14వ వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 225 సంఘాలకు రూ.12 కోట్ల 25 లక్షలు బ్యాంక్ లింకేజ్‌కు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. వారి వార్షిక బడ్జెట్, ప్రగతి నివేదిక సావనీరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు పంపిణీ చేస్తున్నదన్నారు.
రుణాలు తీసుకోవడానికి పురుషులు బ్యాంకులకు వెళితే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి కొద్దిగా ఆలోచన చేస్తున్నాయని, కాని మహిళా సంఘాలకు మాత్రం పిలిచి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉందని అన్నారు. బ్యాంకు లింకేజ్ ద్వారా పొందిన రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలు స్థాపించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ గునుగుర్తి స్వరూప, ఎంపీడీవో సంధ్య, డీఆర్డీవో ప్రభాకర్, ఏపీడీ జంగారెడ్డి, జేడీఎం హమీద్, డీపీఎంలు బాల్‌రాజ్, నిర్మల, ఏపీఎం రవీందర్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు అలువేలు మంగమ్మ, కార్యదర్శి అశ్విని, ఎంపీటీసీలు శ్రీనివాస్, మల్లేశ్, అంజయ్య, మాజీ ఎంపీటీసీ రవీందర్, కో ఆప్షన్ సభ్యుడు బిలాల్ పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం ఐకేపీ ఏపీఎం రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ కృపేశ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా అందజేస్తున్న రుణాలతో చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఐకేపీ ఆధ్వర్యంలో ఏడాదిలో బ్యాంకుల ద్వారా 718మహిళా సంఘాలకు 32,51,28,000రుణాలు అందజేసినట్లు తెలిపారు. అలాగే, స్త్రీనిధి ద్వారా 533 సంఘాలకు 4,99,15,400అందజేసినట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మహిళా సమాఖ్యలో 1,67,95,464టర్నోవర్ ఉందని ఐకేపీ అధికారులు తెలిపారు. సమావేశంలో మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు అనురాధ, ఉపాధ్యక్షురాలు మహేశ్వరి, కార్యదర్శి నిర్మల, కోశాధికారి సంధ్య, దివ్యాంగుల సమాఖ్య అధ్యక్షుడు జంగయ్య, స్త్రీనిధి మేనేజర్ రవితో పాటు ఆయా గ్రామాల మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, మహిళలు పాల్గొన్నారు.