ఆదిబట్ల, జూలై 28 : అందమైన ఇంటి ముందు రకరకాల మొక్కలతో పార్కు.. ఆ పక్కనే స్విమ్మింగ్‌పూల్ ఇంటి చుట్టూ వివిధ రకాల పండ్ల మొక్కలు చూడగానే ఆకట్టుకునే పచ్చదనం మనసుకు ప్రశాంతత కలిగేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడుపాలని అందరికీ ఉంటుంది. కానీ అందరికీ సాధ్యం కాకపోవచ్చు సాధ్యమైనవాళ్లు ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడే తడవుగా నగరంలోని కాలుష్యానికి దూరంగా ఎంతో కొంత భూమి కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. తీరిక దొరికినప్పుడు సెలవులు, వారాంతాల్లో వచ్చి సరదాగా గడుపుతున్నారు. ఇలాంటి ఫాంహౌస్‌లకు ఎగువ ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలు వేదిక అవుతున్నాయి. ఈ ప్రాంతంలో అడవులు కొండల ప్రాంతాలు కావడంతో ఈ ప్రాంతంలో ఇప్పటికే వందల సంఖ్యలో ఫాంహౌస్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆదిబట్ల, కొంగరకలాన్, రావిరాల, బొంగ్లుర్, గ్రామాలు ఔటర్ రింగురోడ్డుకు ఆనుకొని ఉండటంతో దానికి చుట్టు ముట్టు ఎకర, అర ఎకర భూములు కొనుగోళ్లు చేసి తమకు నచ్చినట్లుగా ఫాంహౌస్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
వీకెండ్లో సేద తీరుతున్న ప్రజలు
ఎత్తైన కొండలు, పచ్చని మొక్కల మధ్యన ఇల్లు నిర్మించుకుని విలాస వంతంగా జీవించాలని చాలామంది కోరుకుంటున్నారు. ఉద్యోగాల రీత్యా బిజినెస్‌తో ఎంతో మంది వారం మొత్తం బిజీగా ఉండేవారు వీకెండ్లో సేద తీరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాటికోసం ఎక్కడికో వెళ్లడం ఎందుకని.. తామే ఓ ఫాంహౌస్ నిర్మించుకుంటే సరదాగా గడపొచ్చని భావిస్తున్నారు. ఔటర్ రింగురోడ్డుకు ఆనుకొని ఉన్న ఆదిబట్ల, కొంగరకలాన్, రావిరాల, బొంగ్లూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న ఫౌంహౌస్‌ల్లో ప్రముఖులవే అధికంగా ఉన్నాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన వారితో పాటు వ్యాపారులు, ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు తక్కువ ధరకు ఎక్కువ భూమి లభించే శివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి, నాగన్‌పల్లి, నెర్రపల్లి, దండుమైలారం, రాయపోల్, ఎలిమినేడు, కప్పాడు, ఉప్పరిగూడ, పోచారం, మంచాల మండల పరిధిలోని ఆరుట్ల, చెన్నారెడ్డిగూడ, ముచ్చర్లకుంట తండా, పటేల్చెర్వుతండా, బుగ్గతండా, ఎల్లమ్మతండా, ఆగపల్లి, రంగాపూర్, దాత్పల్లి, లింగంపల్లి, యాచారం మండలంలోని మొండిగౌరెల్లి, కొత్తపల్లి, చింతపట్ల, మాల్, కిషన్‌పల్లి, మంతన్‌గౌరెల్లి, చౌదర్పల్లి, గున్గల్ గ్రామాల్లో భూములు కొని ఫాంహౌస్‌లుగా తీర్చిదిద్దుతున్నారు.
ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు భూమి తీసుకొని అందులో ఓ వైపు అందమైన ఇల్లు .. ఇంటి ముందు పిల్లలు ఆడుకునేందుకు, సేదతీరేందుకు పార్కు.. ఇంటి పక్కనే సరదాగా ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించుకుంటున్నారు. ఇంటి చుట్టూ పండ్లు, పూల మొక్కలు నాటి పచ్చని అందాలను ఆస్వాదిస్తున్నారు. కొందరు వివిధ రకాల పక్షులు, జంతువులను సైతం పెంచుకుని వారాంతాల్లో ఉత్సాహంగా గడుపుతున్నారు.
భూముల ధరలకు రెక్కలు..
ఔటర్ రింగు రోడ్డు నుంచి శివారు ప్రాంతాలైన మంచాల, యాచారం మండలాలు కేవలం 30 నుంచి 40 కిలోమీటర్లు దూరంలో ఉంటాయి. దీంతో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా మంది ఫాంహౌస్‌ల నిర్మాణానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఈ ప్రాంతంలో తక్కువ ధరకు ఎక్కువ భూమి లభిస్తుండటంతో ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రాంతంలో అత్యధికంగా భూములు కొనుగోళ్లు చేశారు. దీంతో ఇటీవల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. రెండు సంవత్సరాల కాలంలో కరోనా నేపథ్యంలో కొందరు పూర్తిగా శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న ఫాంహౌస్ల్లోనే ఉంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు ఇక్కడే కాలక్షేపం చేస్తున్నారు. ఇంకొందరైతే నగరానికి చేరువలో ఉండటంతో ఇక్కడే ఉండి ఉద్యోగాలు, వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎలాంటి కాలుష్య కారక ఫ్యాక్టరీలు లేకపోవడంతో ప్రశాంత వాతావరణం స్వచ్ఛమైన గాలి లభిస్తుండడంతో ఫాంహౌస్‌ల నిర్మాణానికి చాలా మందిలో ఆసక్తి పెరిగింది.
ఎంతో ప్రశాంతంగా ఉంటుంది
ఫాంహౌస్‌ల్లో ఉన్నంత సేపు ఎంతో ప్రశాంతత ఉంటుంది. రోజువారీ పనుల్లో ఎంతో బిజీగా ఉంటూ వారంలో రెండు మూడు రోజులు ఫాంహౌస్‌లో ఉంటున్నాం. నేను మాల్ సమీపంలో కొంత భూమి కొనుగోలు చేసి ఫాంహౌస్ ఏర్పాటు చేసుకున్నా. అక్కడ వ్యవసాయ భూమిలో కొన్ని పంటలు వేసి వ్యవసాయం సైతం చేస్తున్నా. ఆదిబట్ల ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో తక్కువ ధరలకు భూములు లభిస్తుండటంతో కొనుగోలు చేశాం.
– పల్లె గోపాల్‌గౌడ్, ఆదిబట్ల
ఔటర్ రింగురోడ్డుతో రవాణా సౌకర్యం
ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటుతో రవాణా సౌకర్యం ఎంతో సులభంగా మారింది. దీంతో ఔటర్‌కు ఆనుకొని ఇప్పటికే వందల కొద్దీ ఫాంహౌస్‌లు వెలిశాయి. మరికొన్నింటిలో రియల్ ఎస్టేట్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నాం. మా బంధువుల కోసం ఫాంహౌస్‌ల నిర్మాణం కోసం మంచాల, యాచారం మండలాల్లో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశాం.
– పయిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, బొంగుళూరు