చేవెళ్ల రూరల్, జూలై 28 : ఎనిమిదో విడుత హరితహారంలో భాగంగా చేవెళ్ల మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అధికారులు జోరుగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం మండల అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నారు. మండలంలోని 37 గ్రామపంచాయతీలు, 11 అనుబంధ గ్రామాల్లో 6.66 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 20 శాతం మొక్కలు నాటారు.
నర్సరీల్లో మొక్కలు సిద్ధం
మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లోని హరితహారం నర్సరీల్లో పెంచిన మొక్కలను ఇప్పటికే 20 శాతం గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా, క్రీడా మైదానాలు, పల్లె ప్రకృతి వనాల్లో నాటారు. నిరంతరం అధికారులు పర్యవేక్షించి సిబ్బంది, కార్యదర్శులకు పలు సూచనలు, సలహాలు చేస్తున్నారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో 40 వేల మొక్కలు
చేవెళ్ల మండల పరిధిలో 4 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు ముడిమ్యాల, మల్కాపూర్, పల్గుట్ట గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలం పరిశీలన చేశారు. మొత్తం 4 బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో ఒక్కో వనంలో 10 వేల చొప్పున 40 వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. త్వరలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొక్కల సంరక్షణకు చర్యలు : రాజ్‌కుమార్, ఎంపీడీవో
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా లక్ష్యానికి మించి మొక్కలు నాటుతున్నాం. ఇప్పటివరకు దాదాపు 20 శాతానికి పైచిలుకు మొక్కలు నాటాం. మిగిలిన 80 శాతం మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాం. పంచాయతీ కార్యదర్శులు, వన సేవకులకు నర్సరీల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. మొక్కలు ఎండిపోకుండా జాలీలు ఏర్పాటు చేసి సంరక్షణకు కృషి చేస్తున్నాం.