పెద్దఅంబర్‌పేట, జూలై 27 : ఒక లారీ వస్తుందంటే మరో వాహనం పోలేని పరిస్థితి. అత్యవసరమైనా ఆగాల్సిన దుస్థితి. భారీ వానలొస్తే వరద భయానికి రాకపోకలే ఆగిపోతున్న స్థితి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గౌరెల్లి.. ఘట్కేసర్ మండలంలోని ప్రతాపసింగారం మధ్య మూసీపై బ్రిడ్జి వద్ద పరిస్థితి ఇది. కానీ, ఇకపై ఈ ఇబ్బందులు ఉండవు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంతోపాటు ఘట్కేసర్ మండల ప్రజల ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త బ్రిడ్జి రాబోతున్నది. ఎంతోకాలంగా చేస్తున్న ఎదురుచూపులకు తెరపడనున్నది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నాటి కల నిజం కాబోతున్నది. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి స్థానంలోనే మరో పెద్ద బ్రిడ్జి వచ్చేస్తున్నది. ఇందుకోసం హెచ్ఎండీఏ రూ.35 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణం కాబోతున్నది.
ఈ మేరకు ఇటీవలే ప్రొసీడింగ్స్ కూడా వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదిపై రూ.545 కోట్లతో పలు బ్రిడ్జీలు నిర్మిస్తున్నట్టు ప్రకటించగా.. అందులో ఇది ఒకటి. బ్రిడ్జి అటు ఘట్కేసర్, ఉప్పల్ మండలాల ప్రజలతోపాటు ఇటు హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బ్రిడ్జితో పదుల సంఖ్యలో కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. వరంగల్ హైవే, విజయవాడ జాతీయరహదారులకు ఇది లింకురోడ్డుగానూ మారుతుంది. మరోవైపు అవుటర్ రింగ్‌రోడ్ మాస్టర్‌ప్లాన్‌కు సైతం ఇది లింకు రోడ్డు. ఈ ఒక్క బ్రిడ్జి నిర్మిస్తే నిత్యం వేల వాహనాలు ఈ దారిగుండా వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది.
భారీ వాహనాల బారులు..
గౌరెల్లి-ప్రతాపసింగారం వద్ద మూసీపై దాదాపు రెండున్నర దశాబ్దాల కిందట బ్రిడ్జి నిర్మించారు. అప్పటి వాహనాలు, ప్రయాణికులకు అది సరిపోయింది. రానురాను వాహనాల రద్దీ పెరిగింది. వరంగల్ జాతీయరహదారిపై నుంచి విజయవాడ హైవేను కలిసేందుకు కూడా ఇది వారధిగా ఉన్నది. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు విపరీతంగా పెరిగాయి. రాత్రయిందంటే చాలు భారీ వాహనాలు దీనిపైనుంచే బారులు తీరుతున్నాయి. బ్రిడ్జి చిన్నగా ఉండడంతో ఓ భారీ వాహనం వెళ్తే.. ఎదురుగా మరోటి వచ్చేందుకు వీలుకాని పరిస్థితి. మరోవైపు, పెద్ద వర్షం వస్తే చాలు మూసీ పొంగి బ్రిడ్జిపై నుంచి నీళ్లు పోతున్న పరిస్థితి ఉన్నది.
దీంతో రహదారి మూసేయాల్సి వస్తున్నది. వాహనాల రద్దీకి తోడు వానొచ్చినప్పుడల్లా తరచూ మూసేస్తుండటం మరింత సమస్యగా మారింది. తాజాగా, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో పాత బ్రిడ్జి స్థానంలో కొత్తది మంజూరైంది. హెచ్ఎండీఏ రూ.35 కోట్ల నిధులు కూడా కేటాయించడంతో త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. కొత్త బ్రిడ్జికి నిధుల కేటాయించడంతో గౌరెల్లి, కుత్బుల్లాపూర్, సద్దుపల్లి, తారామతిపేట తదితర గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణంతో చుట్టు పక్కల గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.
భయం ఉండదు
బ్రిడ్జి చిన్నగా ఉండటంతో ప్రయాణాలకు ఇబ్బందిగా ఉండేది. వర్షాలు వస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారేది. కొత్తగా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించడం సంతోషం. ఇకపై వానలొచ్చినా ఏ భయం లేకుండా ప్రయాణాలు చేయొచ్చు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందనే దిగులు ఉండదు.
– వేముల వెంకటేశ్, గౌరెల్లి
రుణపడి ఉంటాం..
వర్షాలు పడినప్పుడల్లా గౌరెల్లి వద్ద మూసీపై ఉన్న బ్రిడ్జి రోడ్డును మూసివేసే పరిస్థితి ఉన్నది. ఈ ఇబ్బందులను బాటసింగారం మార్కెట్ కమిటీ చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అక్బర్ అలీఖాన్‌తో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటాం.
– తుడుము మల్లేశ్, గౌరెల్లి సర్పంచ్
సమస్య తీరునున్నది..
కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు సంతోషంగా ఉన్నది. ఉప్పల్, సికింద్రాబాద్‌తోపాటు వరంగల్ వైపు ఏ పని పడ్డా ఈ బ్రిడ్జినే దిక్కు. దీన్ని దశాబ్దాల కిందట నిర్మించారు. బ్రిడ్జిపై నుంచి నీళ్లు వెళితే చుట్టూ పదుల కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. కొత్త బ్రిడ్జి రాకతో సమస్య తీరనున్నది.