చేవెళ్లటౌన్, జూలై 27: రానున్న పోటీ పరీక్షల్లో ఉద్యోగార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ అభ్యర్థులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆర్థిక సాయంతో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్-3, గ్రూపు-4 కోచింగ్‌కు విద్యార్థులకు 60 రోజులుగా ఉచిత శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. శిబిరం ముగింపు సందర్భంగా చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సబితారెడ్డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పీజేఆర్ కోచింగ్ నిర్వాహకుడు జగదీశ్వర్‌రెడ్డితో కలిసి అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో నోటిఫికేషన్లు వచ్చినా కోచింగ్.. తదితర విషయాలను ఎవరూ పట్టించుకునేవారు కాదన్నారు. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి కోసం అలోచించి రాష్ట్రంలో ఎక్కడికక్కడ శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయించారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 93 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గత 8 సంవత్సరాల్లో లక్షా 30వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసుకొని, ఇప్పటివరకు 60వేల ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు చెప్పారు. పరీక్షలు అందరూ రాసేలా ఒక్కో నోటిఫికేషన్‌కు మధ్య వ్యవధి ఇచ్చిందన్నారు.
కైటెక్స్ పరిశ్రమలో 12వేల మందికి ఉపాధి
షాబాద్‌లో నిర్మితమయ్యే కైటెక్స్ పరిశ్రమలో 12వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు వచ్చేలా, పరిశ్రమలు స్థాపించేలా చొరవ తీసుకుంటూ పెద్దఎత్తున ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నారని తెలిపారు. సొంత నిధులు వెచ్చించి ఎమ్మెల్యే యాదయ్య నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ ఇవ్వడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.
కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, వైస్ ఎంపీపీ శివప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ చింటు, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, నవాబుపేట ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, శంకర్పల్లి జడ్పీటీసీ గోవిందమ్మ, శంకర్పల్లి మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్‌కన్నా, షాబాద్ జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజు, సర్పంచ్‌లు మల్లారెడ్డి, శివారెడ్డి, మోహన్‌రెడ్డి, నరహరిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, భీమయ్య, జహంగీర్, ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు నరేందర్, రవి, అశోక్‌కుమార్, సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, నాయకులు రంగారెడ్డి, నాగార్జునరెడ్డి, వెంకటేశ్, రాములున్నారు.
పంటల పరిశీలన
మొయినాబాద్, జూలై 27 : మండల పరిధిలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్, అమ్డాపూర్, బాకారం, నాగిరెడ్డిగూడ గ్రామాలకు సంబంధించిన పంట పొలాలను తాకుతూ ఈసీ వాగు ప్రవహిస్తున్నది. దీంతో బుధవారం సాయ ంత్రం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, సర్పంచ్ రవళితో కలిసి నీటిపాలైన పంటలను పరిశీలించారు. ఏఏ ప్రాంతాల్లో ఏ పంటలు నీట మునిగాయో.. అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి రైతులకు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేశ్, నాయకులు జయవంత్, కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
ఇష్టపడి చదవాలి
అనంతరం రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రమ మీ ఆయుధం అయితే.. విజయం మీ బానిస అవుతుందని చెప్పారు. కష్టంగా కాకుండా ఇష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని సూచించారు. పరిగి, వికారాబాద్‌లలో కూడా పీజేఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌తో 68 మంది ఉద్యోగాలు సాధించారని తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు షాబాద్‌లో వెల్సన్ కంపెనీ ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం షాబాద్ వైపే చూస్తున్నదన్నారు.
ఉన్నత స్థాయికి చేరుకోవాలి
ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. ఒకేసారి ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కార్యాచరణ దేశంలో ఎక్కడ కూడా జరుగలేదని, నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డు స్థాయిలో వరం ఇచ్చారని తెలిపారు. అందుకు కష్టపడి చదివితే భవిష్యత్ బంగారుమయమవుతుందని, ఉద్యోగాలను పొంది ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్లుల కలలను సాకారం చేయాలంటే ఉద్యోగం సాధించి తీరాలన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం 60 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని ఎక్కువ ఉద్యోగాలు సాధించి మంచి పేరు తీసురావాలని సూచించారు. శిక్షణ తరగతులను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక శిక్షణ ఇస్తూ, ఉచితంగా భోజన సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
చేవెళ్ల, షాబాద్ మండలాల్లో వర్షానికి దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే యాదయ్య
షాబాద్, జూలై 27 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో మంగళవారం కురిసిన భారీ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం మంత్రి పర్యటించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, యువనేత కార్తీక్‌రెడ్డితో కలిసి చేవెళ్ల మండల పరిధిలోని రేగడిఘనపూర్ ఇదుల వాగు, షాబాద్ మండలం రేగడిదోస్వాడ గ్రామంలో వాగు ఉధృతికి దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కురిసిన వర్షంతో వాగుకు పెద్ద ఎత్తున వరద వచ్చిందని, రోడ్డు తెగిపోయిందని రేగడిదోస్వాడ గ్రామస్తులు మంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. అకస్మాత్తుగా కురిసిన వర్షంపై ఎప్పటికప్పుడూ అధికారులతో ఫోన్ల ద్వారా సమీక్షించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నదులు, కల్వర్టుల వద్ద పూడికతీత పనులు చేపట్టి నీరు సాఫీగా వెళ్లేలా చూడాలన్నారు. వర్షాల అనంతరం వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ వర్షంతో తలెత్తిన పరిస్థితులపై ఎమ్మెల్యే యాదయ్యను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల పరిధుల్లో మూసీ, ఈసీ వాగులు ఉవ్వెత్తున ప్రవహించాయని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ఉధృతి ఉంటే దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ రాములు, ఎంపీటీసీ పార్వతమ్మ, నాయకులు మల్లారెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, అధికారులున్నారు.