పరిగి, జూలై 27 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో ఉపాధి హామీలో లక్షలాది మంది కూలీలకు పని కల్పించడం కష్టసాధ్యంగా మారనుంది. ఇప్పటికే అనేక మార్పులు చేస్తూ, తాము చెప్పినట్లుగానే పనులు చేయించాలంటూ ఆజమాయిషీ చేస్తున్న కేంద్రం రోజుకో విధంగా నిబంధనలు మార్చడంతో ఉపాధి హామీలో పనిచేస్తున్న సిబ్బందికి పని భారంతోపాటు కూలీలకు భవిష్యత్తులో పని కల్పించాలంటే మరింత ఇబ్బందికరంగా మారనుంది. దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాలు, తమకు అనుకూలమైన పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఉపాధి పనులకు సంబంధించి చూసీచూడనట్లుగా ఉన్నది.
కాని తెలంగాణపై కేవలం కక్షపూరితంగా వ్యవహరించడం ద్వారా వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే లక్ష మంది కూలీలకు పని లభించని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రతి సంవత్సరం జిల్లాల పరిధిలో ఎంత మేరకు, ఎంత మంది కూలీలకు పని కల్పిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేది. దీన్ని కాదంటూ అంతా తాము చెప్పిన విధంగా చేయాలని కేంద్రం పట్టుబట్టడంతో జిల్లాలో 19 లక్షల పనిదినాల లక్ష్యం తగ్గిపోయింది. ఈసారి జిల్లా పరిధిలో 1,04,00,000 పనిదినాలు కల్పించాలని రాష్ట్రం నిర్ణయించగా.. అందుకు విరుద్ధంగా కేంద్రం నిబంధనల పేరిట మోకాలడ్డుతూ 85లక్షల పని దినాలు కల్పించేలా లక్ష్యం నిర్దేశించబడింది. దీంతో ఒకేసారి 19 లక్షల పని దినాల లక్ష్యం తగ్గిపోవడం గమనార్హం.
ఇప్పటికే తగ్గిన 13 లక్షల పనిదినాలు
కొత్త నిబంధనలతో జిల్లా పరిధిలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 13 లక్షల పనిదినాలు తగ్గాయి. గత సంవత్సరం జూలై నెలాఖరు వరకు 56 లక్షల పనిదినాలు ఉండగా.. ఈసారి 43 లక్షల పనిదినాలు చేపట్టారు. కూలీల పరంగా పరిశీలిస్తే సుమారు లక్ష మందికి పని లభించలేదు. ఈ సంవత్సరం చివరి వరకు మరింత పనిదినాలు తగ్గే అవకాశం ఉన్నది. దీంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు పని కల్పించడం మరింత ఇబ్బందికరంగా మారనుంది.
నిలిచిపోయిన కల్లాల నిర్మాణాలు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిబంధనలు మార్చడం ద్వారా పంట పొలాల్లో కల్లాల నిర్మాణాలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఈసారి 2,800 కల్లాలు నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో రెండు విభాగాలుగా చిన్నవాటికి రూ.65వేలు, పెద్దవాటికి రూ.75వేలు అందిస్తారు. జిల్లాలో 1,050 కల్లాల నిర్మాణాలు చేపట్టగా 800 కల్లాల నిర్మాణ డబ్బులే మంజూరయ్యాయి. నిబంధనల మార్పుతో జిల్లాలో 200 కల్లాల నిర్మాణం పూర్తి చేసిన వారికి డబ్బులు అందలేదు. దీంతోపాటు ఇకమీదట కల్లాల నిర్మాణం చేపట్టే అవకాశం లేకుండా పోయింది. రైతులు తమ పొలాల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నూర్పిళ్లు చేసేందుకు ప్రధాన రోడ్లపై వేస్తున్నారు. అలా కాకుండా పొలాల వద్ద నూర్పిళ్లు చేసి, ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకువచ్చేలా ఈ కల్లాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కల్లాల నిర్మాణానికి నిధులిచ్చేది లేదంటూ కేంద్రం తెగేసి చెప్పడంతో ప్రస్తుతం కల్లాల నిర్మాణ పనులు జరుగడం లేదు.
కూలీలకు అందాల్సినవి రూ.3.62 కోట్లు
నిబంధనల పేరిట కూలీలకు పని లభించని పరిస్థితి కల్పిస్తున్న కేంద్రం.. చేసిన పనులకు సంబంధించి కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించడంలేదు. గత నెల రోజులుగా కూలీలకు కూలీ డబ్బులు అందించలేదు. వికారాబాద్ జిల్లా పరిధిలో కూలీలకు ఉపాధిహామీ కూలీ డబ్బులు రూ.3.62కోట్లు అందాల్సి ఉన్నది. పనిచేసి నెల రోజులైనా కూలీ డబ్బు ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలకు పని చేసిన నెలకు డబ్బులు ఇవ్వకుంటే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన పని భారం
కొత్త నిబంధనలతో ఉపాధి హామీ సిబ్బందికి పని భారం చాలా వరకు పెరిగింది. ప్రధానంగా ప్రతి పనికి ఒక అంచనా తయారుచేయాల్సి ఉండగా కొత్త నిబంధనలతో ముం దుగా సెక్యూర్ సాఫ్ట్‌వేర్‌లో పని అంచనా అప్లోడ్ చేయాలి, అనంతరం నేషనల్ ఇన్ఫార్మాటిక్ సెంటర్(ఎన్ఐసీ)లో మరోసారి అప్లోడ్ చేయాలి. దీంతో ప్రతి పనికి రెండుసార్లు పని అంచనాలు అప్లోడ్ చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. పని విధానంలో మార్పుతో కంప్యూటర్ ఆపరేటర్లు, ఈసీలకు మరింత పనిభారం పడింది. ఉద్యోగుల వేతనాలు తప్ప పరిపాలనాపరంగా ఉండే ఖర్చులకు సంబంధించి రాష్ట్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు.