క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. క్రీడల ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించి ప్రతి గ్రామపంచాయతీతో పాటు అనుబంధ గ్రామాల్లోనూ ఒక ఎకరం స్థలంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
– చేవెళ్ల రూరల్, జూలై 27
చేవెళ్ల మండలంలోని 30 గ్రామాల్లో..
గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో స్థలాలను ఎంపిక చేసి మైదానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చేవెళ్ల మండల పరిధిలోని 37 గ్రామపంచాయతీలు, 11 అనుబంధ గ్రామాల్లో ఇప్పటి వరకు 7 క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకా 30 క్రీడా మైదానాల ఏర్పాటుకు స్థలాలను కేటాయించి పనులు ముమ్మరంగా సాగేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మొక్కలు సిద్ధం..
ప్రభుత్వం క్రీడామైదానాల చుట్టూ మొక్కలు నాటాలని ఆదేశించడంతో దాదాపు 32 వేల మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పలు క్రీడా మైదానాల్లో మొక్కలు నాటారు. మిగతా మైదానాలు పూర్తిగా అందుబాటులోకి రాగానే లక్ష్యం మేరకు నాటుతామని అధికారులు పేర్కొంటున్నారు. క్రీడా మైదానాలకు స్థలాలను కేటాయించిన అనంతరం మట్టి పోసి చదును చేయుట, కమాన్ ఏర్పాటు, మైదానం చుట్టూ మొక్కలు నాటేలా అధికారులు పనులు చేయిస్తున్నారు.
క్రీడలకు అనువుగా..
ఒక్కో క్రీడా మైదానం ఏర్పాటుకు రూ.4 లక్షల 17 వేల పైచిలుకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. వాలీ బాల్ పోల్స్, ఖోఖో, కబడ్డీ, లాంగ్ జంప్, హై జంప్, వ్యాయామం చేసే పరికరాలు, గ్రామీణ యువత ఆడుకునేందుకు అనువైన విధంగా మైదానాలను ఏర్పాటు చేస్తున్నారు.
అందుబాటులోకి తీసుకొస్తున్నాం..
గ్రామీణ యువతకు దూర భారం లేకుండా ప్రభుత్వం గ్రామాల్లోనే క్రీడా మైదానాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఏడు క్రీడా మైదానాలను సిద్ధం చేశాం. మరో 30 గ్రామాల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రాజ్‌కుమార్, ఎంపీడీవో