కులకచర్ల, జూలై 24: వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో సర్కారు దవాఖానకు వెళ్లాలంటేనే రోగులు భయపడేవారు. కానీ, రోజులు మారాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రైవేటు దవాఖాన వద్దు.. సర్కార్ దవాఖానే ముద్దు అనే స్థాయిలో ప్రజల్లో మార్పు వచ్చిందంటే.. వైద్య ఆరోగ్య శాఖ ఎంత మెరుగైన సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలనే లక్ష్యంతో దవాఖానకు వచ్చే వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడమే కాకుండా నిత్యం ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేస్తుండటంతో క్షేత్ర స్థాయినుంచే వైద్య ఆరోగ్య శాఖలో మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గతంలో నిత్యం 20 నుంచి 40 మంది రోగులు వచ్చేవారు. కానీ నేడు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ 60 నుంచి 150 మంది రోగులు దవాఖానలో సేవలు పొందుతున్నారు.
కాన్పుల కోసం మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నది. గతంలో ఇక్కడ వైద్య సేవల కోసం నెలకు చాలా తక్కువ సంఖ్యలో 3 నుంచి 4 కాన్పులు అయితే మహాకష్టం అయ్యేది. ప్రస్తుతం నెలకు 30 నుంచి 40 కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం మెరుగైన సేవలతో పాటు, నిత్యం డాక్టర్ల పర్యవేక్షణ, అందుబాటులో మందులు ఉండటం, దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో మహిళలు, రోగులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
కేసీఆర్ కిట్‌తో..
అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ దవాఖానలో కాన్పుల కోసం వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. సర్కార్ దవాఖానలో కాన్పు కోసం వస్తే కేసీఆర్ కిట్‌తోపాటు, బాలింతల ఖర్చుల కోసం రూ.12 వేలు ఇస్తుండటంతో మైరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. 9 నెలల పాటు గర్భిణులకు కావాల్సిన మందులు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది. అదే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే వేలల్లో, లక్షల్లో ఫీజులు వసూలు చేసే అవకాశం ఉండటంతో గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రి కంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా ప్రసవ సమయంలో ఇబ్బందులు లేకుండా అమ్మ ఒడి 102 వాహనాన్ని ఏర్పాటు చేయ డం, ప్రసవమయ్యాక ఇంటికి వెళ్లేందుకు 102 వాహనం ద్వారా సేవలు అందిస్తుండటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.
మరో మూడు పల్లె దవాఖానలు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వస్తున్న మెరుగైన ఫలితాల నేపథ్యంలో కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసేందుకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. కులకచర్ల మండలంలో కుస్మసముద్రం, చౌడాపూర్ మండలంలో మరికల్, మందిపల్ గ్రామాలకు పల్లె దవాఖానలు మంజూరుకానున్నాయి.
రోగుల సంఖ్య పెరిగింది..
కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గతంలో కంటే ప్రస్తుతం ఓపీకి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ప్రైవేటుకు బదులుగా ప్రభుత్వ దవాఖానలో చూపించుకునేందుకు రోగులు ఇష్టపడుతున్నారు. సమస్యలను జిల్లా అధికారులకు తెలియజేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
– చంద్రప్రకాశ్, సీహెచ్‌వో, కులకచర్ల
పేషెంట్లకు అందుబాటులో సేవలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెంట్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యచికిత్సలు నిర్వహిస్తున్నాం. దీంతో ప్రతి రోజూ దవాఖానకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దవాఖానలకు వచ్చేవారికి ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంటుంది.
– మురళీకృష్ణ, వైద్యాధికారి కులకచర్ల