రంగారెడ్డి, జూలై 23, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలోని ఏడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. చేవెళ్లలో 9.1 సెం.మీ, శంకర్పల్లి మండలంలో 8.1 సెం.మీటర్ల వర్షం కురుసింది. ఎగువ ప్రాంతంలోని వికారాబాద్, నవాబుపేట మండలాల్లో కురిసిన వర్షానికి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. శంకర్పల్లి వద్ద మూసీ నది పాత వంతెనపై నుంచి వరద ఉప్పొంగుతున్నది. మరోవైపు ఈసీ వాగు కూడా షాబాద్, మొయినాబాద్ మండలాల మీదుగా స్వల్పంగా ప్రవహిస్తున్నది. జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని మెజార్టీ చెరువులు నిండుకుండలా మారగా, పలు చెరువులు అలుగు పారుతున్నాయి.
సాధారణానికి మించి వర్షపాతం..
జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్, జూలై నెలల్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 244.7 మి.మీటర్లు కాగా, 382.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 56.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 91.7 మి.మీటర్లు కాగా, 126 మి.మీటర్లు, జూలై నెలలో సాధారణ వర్షపాతం 153 మి.మీటర్లు, ఇప్పటివరకు 256.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలోని ఏడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా, మిగతా 20 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. చేవెళ్ల మండలంలో 90.3 మి.మీటర్లు, శేరిలింగంపల్లి మండలంలో 90.2 మి.మీ, శంకర్పల్లి మండలంలో 81.3 మి.మీ, రాజేంద్రనగర్‌లో 76.8 మి.మీ, గండిపేటలో 72.3 మి.మీ, మొయినాబాద్ మండలంలో 72 మి.మీ, షాబాద్ మండలంలో 68.2 మి.మీ, శంషాబాద్‌లో 61.2 మి.మీ, సరూర్‌నగర్‌లో 52.2 మి.మీ, హయత్‌నగర్‌లో 48.3 మి.మీ, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 45.3 మి.మీ, ఇబ్రహీంపట్నంలో 41.8 మి.మీ, యాచారంలో 36.2 మి.మీ, మంచాలలో 31.4 మి.మీ, కందుకూరులో 36.1 మి.మీ, కొత్తూరులో 39.5 మి.మీ, నందిగామలో 49.5 మి.మీ, ఫరూఖ్‌నగర్‌లో 36.1 మి.మీ, కొందుర్గులో 24.7 మి.మీ, మహేశ్వరంలో 45.1 మి.మీ, కేశంపేటలో 21.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, జూలై 23 : విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. సాధారణంగా జూలై తర్వాత వర్షాలు అధికంగా వస్తాయి. కానీ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలోనే భారీ వర్షాలు కురిశాయి. తెరిపి లేకుండా కురిసిన వర్షాలు రెండు, మూడు రోజుల వ్యవధి ఇచ్చి మళ్లీ వానలు పడుతుండడంతో జిల్లాలో 129 చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. మిగతా చెరువులూ అలుగు పారడానికి సిద్ధంగా ఉన్నాయి. రెండు పంటలకు సాగునీటికి కొదువలేదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అలుగు పారుతున్న 129 చెరువులు…
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 1175 చెరువులు ఉండగా, 129 చెరువులు అలుగులు పారుతున్నాయి. కురుస్తున్న వర్షాలతో 25 శాతం వరకు నీరున్నవి 105 చెరువులు, 25 నుంచి 50శాతం నీరున్న చెరువులు 605, 50 నుంచి 75శాతం నీరున్న చెరువులు 210, 75 నుంచి 100 శాతం వరకు నీరున్నవి 126 చెరువులు ఉన్నాయి. మళ్లీ వర్షాలు పడితే దాదాపుగా అన్ని చెరువులు అలుగులు పారనున్నాయి. జిల్లాలో ప్రధానమైన మధ్యతరహా ప్రాజెక్టు కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టు, వికారాబాద్ సమీపంలోని శివసాగర్, అల్లాపూర్, నందివాగు చెరువులన్నీ అలుగులు పారుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టడంతో నీటి నిలువ సామర్థ్యం పెరిగింది. పూడికతీత పనులు చేపట్టడంతోపాటు కట్ట పటిష్టత, తూముల మరమ్మతు, ఇతర పనులతో చెరువులు మరింత పటిష్టంగా తయారయ్యాయి.
జిల్లాలో భారీ వర్షం..
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురియడంతో జిల్లాలోని మర్పల్లిలో 57.2 మి.మీ., మోమిన్‌పేట్‌లో 52.8 మి.మీ, నవాబుపేటలో 44.8 మి.మీ, వికారాబాద్‌లో 67.2 మి.మీ, పూడూరులో 81.4 మి.మీ, పరిగిలో 30.9 మి.మీ, కులకచరల్లో 9.8 మి.మీ, దోమలో 21.2 మి.మీ, బొంరాస్‌పేట్‌లో 28.8 మి.మీ, ధారూర్‌లో 40.7 మి.మీ, కోట్‌పల్లిలో 40.8 మి.మీ, బంట్వారంలో 51.0 మి.మీ, పెద్దేముల్లో 33.0 మి.మీ, తాండూరులో 23.2 మి.మీ, బషీరాబాద్‌లో 31.3 మి.మీ, యాలాలలో 18.3 మి.మీ, కొడంగల్‌లో 30.0 మి.మీ, దౌల్తాబాద్‌లో 32.5 మి.మీ, చౌడాపూర్‌లో 11.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లాలో సరాసరి 37.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
చెరువులు, ప్రాజెక్టులకు జలకళ..
ఎడతెరిపి లేకుండా శుక్రవారం నుంచి శనివారం వరకు కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు నిండాయి. వికారాబాద్‌లోని శివసాగర్ చెరువు అలుగు పారుతున్నది. మండల పరిధిలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరి అలుగు పారుతున్నది. కొంపల్లి చెరువులోకి వరద నీరు వచ్చి చేరింది. ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి చెరువులోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో అలుగు పోస్తున్నది. మున్నూర్‌సోమారం గ్రామ సమీపంలోని చెరువులోకి వరద నీరు చేరింది. ఎబ్బనూరు చెరువు నిండి మత్తడి దుంకుతున్నది. ధారూరు మండల పరిధిలోని బాచారం వద్ద రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తాండూరుకు వెళ్లే వాహనాలను వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ ధారూరు ఎక్స్ రోడ్ మీదుగా దారి మళ్లించారు. వాహనదారులు ఇటుగా వెళ్లకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
వాగుల పరిశీలన
చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవల్లి, గొల్లపల్లి, ధర్మసాగర్ గ్రామాల పరిధిలోని వాగులను తహసీల్దార్ వైఎస్.శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్‌కుమార్, పంచాయతీ రాజ్ డీఈ జగన్‌రెడ్డి, ఆర్ఐ రాజేశ్ తదితరులు పరిశీలించారు. మండలంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎకడా నష్టం జరుగలేదని తెలిపారు.
పొంగిపొర్లుతున్న ప్రాజెక్టులు
ధారూరు మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురవడంతో రుద్రారం-నాగసముందర్ మధ్య కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు వాగు వంతెనపై వరద నీరు పొంగి పొర్లుతున్నది. దీంతో రాకపోకలు నిలచిపోయాయి. ధారూరు స్టేషన్-దోర్నాల్ గ్రామాల మధ్య ఉన్న కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. వికారాబాద్-తాండూరు మధ్య బాచారం గ్రామ సమీపంలోని తాత్కాలిక రోడ్డు దెబ్బతినడంతో వాహనాలను ధారూరు నుంచి గడ్డమీది గంగారం మార్గంలో అధికారులు మళ్లిస్తున్నారు. మండలంలోని చిన్న చిన్న వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి.