ఇబ్రహీంపట్నం/ మంచాల, జూలై 23 : రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తూ పెట్టుబడులు సమకూర్చుతూ తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి కొనియాడారు. ఒక రోజు ముందుగా మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంచాల మండలంలోని జాపాల-కాగజ్‌ఘాట్ గ్రామాల సమీపంలోని అటవీప్రాంతంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న మంత్రి కేటీఆర్‌కు మనమంతా అండగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఆయన పెట్టుబడిదారులను ఆకర్శిస్తున్నారని పేర్కొన్నారు.
ఐటీ, పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరిందన్నారు. రంగారెడ్డిజిల్లాలో కూడా పెద్దఎత్తున ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మంత్రి కేటీఆర్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, ఐటీ రంగం పెద్దఎత్తున అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వారికి నీరు కూడా ఎంతో అవసరమని.. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతానికి శివన్నగూడ రిజర్వాయర్ నుంచి సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను కూడా తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించారన్నారు. పనులు కూడా త్వరితగతిన సాగుతున్నాయని, త్వరలోనే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు శివన్నగూడ రిజర్వాయర్ నుంచి సాగునీరు రానుందని తెలిపారు.
ప్రతి శుభకార్యానికి ముందు విరివిగా మొక్కలు నాటాలి
పుట్టినరోజు, పెళ్లిరోజులు, వివాహాలకు ఇస్తున్న ప్రాధాన్యతను మొక్కలు పెంచడానికి కూడా ఇవ్వాలని మంత్రి సబితారెడ్డి కోరారు. ప్రతి ఇంటిలో శుభకార్యాలు జరుపుకొంటున్న మాదిరిగానే ప్రతి ఇంటిలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటాలని ఆమె కోరారు. మొక్కలు నాటడంతో వాతావరణ కాలుష్యం తగ్గిపోవటంతోపాటు కరువు కూడా తీరిపోతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కరువును జయించాలన్న ఉద్దేశంతో హరితహారం వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందన్నారు. అడవుల పెంపకంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని కోరారు. పల్లె, పట్టణ ప్రగతిలో హరితహారానికి కేటాయించిన నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామగ్రామాన హరితహారాన్ని పండుగలా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, జిల్లా అటవీశాఖ అధికారి మసూద్, ఆర్డీవో వెంకటాచారి, రేంజ్ ఆఫీసర్ విష్ణువర్ధన్, ఎంపీపీలు నర్మద, కృపేశ్, జడ్పీటీసీ జంగమ్మ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మల్లేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచ్‌లు వాహిదాబేగం, ఆండాళు, హరిప్రసాద్, ఎంపీటీసీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అనిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి బహదూర్, నాయకులు బద్రీనాథ్, రాంరెడ్డి, ఉపసర్పంచ్ మల్లప్ప, నాగరాజు, సతీశ్, చంద్రకాంత్, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కరువును జయించాం:ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ నగరానికి అతిచేరువలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గతంలో కరువుతో అల్లాడుతుండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంతో నియోజకవర్గంలో పెద్దఎత్తున మొక్కలు నాటడంతో పాటు అటవీప్రాంతాల్లో కూడా మొక్కలు నాటి అంతరించిపోతున్న అడవులను నిలబెట్టుకున్నామని, దీంతో నియోజకవర్గంలో హరితహారం ద్వారా కరువు జయించామన్నారు. గత సంవత్సరం కూడా మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తులేకలాన్ అటవీప్రాంతంలో లక్ష మొక్కలు నాటామని, ఈ ఏడాది కూడా జాపాల అటవీ ప్రాంతంలో లక్ష మొక్కలు నాటనున్నామన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలన్నారు. త్వరలో రాష్ట్రంలో కొత్తగా అర్హులైనవారందరికి పింఛన్లు, రేషన్‌కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వనుందని.. ఇందులో మొక్కలు నాటినవారికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించనుందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలోనే అగ్రగామిగా నిలపాలి
నియోజకవర్గాన్ని హరితహారంలో జిల్లాలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. ప్రస్తుత భూభాగానికి 650 మీటర్ల ఎత్తులో ఇబ్రహీంపట్నం ఉన్నదని.. ఈ ప్రాంతానికి శాశ్వత సాగునీరు అందించాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. వెంటనే ఆయన స్పందించి శివన్నగూడ రిజర్వాయర్ నుంచి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఆగాపల్లి నుంచి జాపాలకు జాపాల నుంచి మంచాలకు డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు. త్వరలోనే మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడ సర్వే నంబర్ 80లో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. అందులో మూడు పరిశ్రమలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదన్నారు.
అబ్జర్వేటరీని తీర్చిదిద్దాలి
జాపాల రంగాపూర్ అబ్జర్వేటరీని కూడా ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే మంత్రిని కోరడంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని ఆమె తెలిపారు. నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఎంకేఆర్ ఫౌండేషన్ నిరంతరం కృషిచేస్తున్నదన్నారు. ఇప్పటికే ఆ ఫౌండేషన్ ద్వారా పలువురు పోలీసు ఉద్యోగాలను సాధించారన్నారు. రాబోయే రోజుల్లో ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందుతున్న 1200 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.