ఇబ్రహీంపట్నం, జూలై 22: కేంద్ర సర్కార్ జీఎస్టీ పేరుతో సామాన్యులు, చిరుద్యోగుల జీవితాల్లో కుంపటి పెట్టింది. నిత్యం అవసరమయ్యే పలు వస్తువులపై జీఎస్టీ విధించి ప్రజలపై ఎనలేని భారం మోపుతున్నది. ఇప్పటికే చాలిచాలని జీతాలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే.. కొత్తగా పాలు, పెరుగు, పప్పు దినుసులపై జీఎస్టీ విధించి తమ బతుకులను ఆగం చేస్తున్నదని కేంద్రంపై చిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. శుక్రవారం కూడా రాస్తారోకోలు, ధర్నాలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. పేదల బతుకులపై పెను ప్రభావం చూపే జీఎస్టీని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందేనని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు నిత్యం అవసరమయ్యే పలు వస్తువులపై జీఎస్టీ విధించడంపై చిరుద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రజలకు నిత్యావసరాలపై పాలు, పెరుగు, పప్పు దినుసులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని మండిపడుతున్నారు. అంతంత మాత్రంగానే వస్తున్న జీతాలతో కాలం వెళ్లదీస్తున్న తమలాంటి వారిపై జీఎస్టీ పన్నుపోటు మరింత కుంగదీసేలా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చిరుద్యోగులతోపాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ఈ పన్నుల పెంపు తీవ్ర ప్రభావం చూపుతున్నదని, దీన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమపట్ల సానుకూలంగా స్పందించి, తమకు పలురకాలుగా తోడ్పాటు అందిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో బాధాకరంగా ఉన్నదని కోరారు.
పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడం సరికాదు : ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, జూలై 22 : పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడం సరికాదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్య ప్రజల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఆదాని, అంబానీలకు కొమ్ముకాసే విధంగా ప్రయత్నిస్తుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, రామస్వామి, గోపాల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలి..
మర్పల్లి, జూలై 22 : కేంద్ర ప్రభుత్వం పాలు, పెరుగు, నిత్యావసర వస్తువులపై విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని మర్పల్లి జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తీసుకురావడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జీఎస్టీని తీసేంత వరకు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సోహెల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌస్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అశోక్, యూత్ అధ్యక్షుడు మధుకర్, టీఆర్ఎస్ మర్పల్లి గ్రామ అధ్యక్షుడు గఫార్, నాయకులు గోపాల్‌రెడ్డి, సంతోశ్‌కుమార్, సుధాకర్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానం సరికాదు..
కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అంతులేని ధరలు, అంతుచిక్కని జీఎస్టీ భారం వల్ల చిరుద్యోగి కష్టాలు పడుతున్నాడు. కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేక గోస తీస్తుండు. చిన్న బతుకులు మోయలేని జీఎస్టీని వెంటనే తగ్గించాలి.
– కుమార్, చిరుద్యోగి(చేవెళ్లటౌన్)
మోదీ పాలనలో ఆకాశాన్నంటిన ధరలు
కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లతో సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్రానికి ప్రజలే సరైన సమాధానం చెబుతారు.
– ప్రసాద్, చిరుద్యోగి(చేవెళ్ల రూరల్)
మరింత భారంగా మారింది..
ఏమి కొనేటట్టులేదు.. ఏమి తినేటట్టు లేదు.. ప్యాకింగ్ చేసిన వస్తువులతో పాటు మజ్జిగా, లస్సి ఇలా ప్రతి దానిపై 5 శాతం జీఎస్టీ విధించడం సరికాదు. చాలిచాలని జీతాలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. జీఎస్టీతో మరింత భారంగా మారింది.
–అనిల్ చిరుద్యోగి షాద్‌నగర్