కులకచర్ల/పెద్దేముల్/బొంరాస్‌పేట, జూలై 22: జిల్లాలో బోనాల సందడి నెలకొన్నది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కులకచర్ల, చౌడాపూర్, పెద్దేముల్, బొంరాస్‌పేట మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రజలు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు అలరించాయి. ఉదయం నుంచే దేవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి.
కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లోని ప్రజలు పోచమ్మకు ఘనంగా బోనాలను సమర్పించి చల్లంగ చూడాలని వేడుకున్నారు. అదేవిధంగా పెద్దేముల్ గ్రామస్తులు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని పోచమ్మను వేడుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేసి ఒడిబియ్యంతోపాటు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
బొంరాస్‌పేట మండలంలోని మెట్లకుంట, తుంకిమెట్ల గ్రామాల్లో పోచమ్మ బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. అదేవిధంగా బొంరాస్‌పేటలో దుర్గామాతకు బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అంటువ్యాధుల బారి నుంచి ప్రజలను కాపాడు తల్లీ అంటూ పోచమ్మను భక్తి శ్రద్ధలతో కొలిచారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పంటలు బాగా పండాలని వేడుకున్నా రు. ఈ వేడుకల్లో కులకచర్ల సర్పంచ్ సౌమ్యావెంకట్‌రాంరెడ్డి, ముదిరాజ్ సంఘం సభ్యులు అనంతయ్య, కృష్ణ, అంజిలయ్య, రాములు, వెంకటయ్య, ఆనంద్, అనంతయ్య, ప్రభు, రాములు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.