పేదలను దృష్టిలో ఉంచుకొని విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం తాండూరులో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రధానంగా రూ.18 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్, రూ.1.40 కోట్లతో కామన్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనలో విద్య, వైద్యంలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. స్వరాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలనను సాగిస్తున్నారన్నారు. ప్రతిష్టాత్మకమైన పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. -తాండూరు, జూలై 20
తాండూరు, జూలై 20: తెలంగాణలో ఉన్న బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం తాండూరులో రూ.18 కోట్లతో మైనార్టీ రెసిడెన్సియల్ విద్యాసంస్థ, రూ.1.40 కోట్లతో కామన్ సర్సీస్ సెంటర్‌ను ప్రారంభించారు. రూ.కోటితో తాండూరులో అంబేద్కర్ భవనం, రూ.50 లక్షలతో యాలాలలో అంబేద్కర్ భవనం, రూ.53 లక్షలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.
ఉచిత కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను స్థానిక నేతలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. సీమాంధ్రపాలనలో తెలంగాణలో విద్య, వైద్యాని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేయడంతో సామాన్యులు సైతం ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు కార్పొరేట్ వైద్యంను ఉచితంగా పొందుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలతో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను తలదన్నేలా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, వయోజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం మరిన్ని ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.
రాష్ట్ర విద్యా, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఇంటర్నేషనల్ స్థాయిలో రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేయడంతో ఇతర రాష్ర్టాల అధికారులు తెలంగాణ విద్యాసంస్థలను పరిశీలించి ఆదర్శంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరమని విమర్శించారు. నిరుద్యోగుల కోసం ప్రత్యేక ఉచిత స్టడీ సర్కిల్స్‌తో పాటు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి చాలా బాగుందని అభినందించారు.
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముందుకెళుతున్నదన్నారు. 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు పథకంతో రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు తాండూరుకు తెచ్చిన నిధులను తెలిపారు. అందరి సహకారంతో మరిన్ని నిధులు తీసుకువస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ముందెన్నడూ లేనివిధంగా తాండూరులో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సబితారెడ్డి సహకారంతో తాండూరుకు మరిన్ని నిధులు తీసుకువచ్చి ఏడాదిలో తాండూరు రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, ఆర్డీవో అశోక్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎంపీపీలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు.