పెద్దేముల్, జూలై 20 : ప్రతి గ్రామపంచాయతీని ఓ మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని డీఆర్డీవో పీడీ కృష్ణన్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మప్ప ఆధ్వర్యంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి హామీ కూలీల పెండింగ్ కూలీల డబ్బులు, ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా గ్రామాల్లో నాటనున్న మొక్కలు, పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత, కొత్త గ్రామపంచాయతీల్లో ఉన్న ఉపాధి హామీ కూలీల వివరాల డేటాల్లో పలుమార్లు అప్డేట్ కావడం వల్ల, ఇన్వాలిడ్ అకౌంట్లు ఉండడం వల్ల కూలీలకు పేమెంట్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
ఏపీవోలు లేక మానిటరింగ్ సరిగ్గా జరుగలేదని, త్వరలో దశలవారీగా పేమెంట్లు వస్తాయని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎనిమిదో విడుత హారితహారంలో భాగంగా 25లక్షల47 వేల మొక్కలు లక్ష్యం కాగా.. అందులో 12 లక్షల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని తెలిపారు. జీపీల్లో ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా ప్రభుత్వం ఒక్కొక్క మొక్కకు రూ.320 ఖర్చు చేస్తున్నదని.. సంరక్షణ కోసం 400 మొక్కలకు రోజుకు రూ.257 వాచర్లకు చెల్లిస్తున్నదని పేర్కొన్నారు. మంబాపూర్, దుగ్గాపూర్, చైతన్యనగర్ మొక్కల పరిస్థితి బాగులేదన్నారు.
మొక్కలు చనిపోతే ఒక్కో మొక్కకు పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.325 రికవరీ చేస్తామని.. నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శులు జీపీల్లో జాబ్ కార్డుల అప్డేట్, వర్క సైట్ల నెమ్ బోర్డుల ఏర్పాటు, వర్క్ ఫైల్, 7 రకాల రిజిస్టర్లను పక్కాగా అమలు చేయాలన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరలో అందుబాటులోకి తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మప్ప, ఎంపీవో సుష్మా, ఇన్చార్జి ఏపీవో ప్రవీణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.