కడ్తాల్, జూలై 19 : నిరుద్యోగ యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జీఏం రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పీఎంఈజీపీ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పీఎంఈజీపీ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకంలో రుణాలకు అన్ని కులాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పీఎంఈజీపీలో బ్యాంక్ ద్వారా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
రుణాలు తీసుకున్న వారికి 15 శాతం నుంచి 30 శాతం వరకు సబ్సిడీ ఉంటుందని చెప్పారు. ఈ పథకానికి గడువు లేదని, ఎప్పుడైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, రుణాలు కావాల్సిన వారు 8వ తరగతి చదివి ఉండాలని చెప్పారు. ఈ పథకంలో బియ్యం దుకాణాలు, పాల ఉత్పత్తి కేంద్రాలు, పేపర్ కప్పులు, మినరల్ వాటర్, చెప్పుల తయారీ కేంద్రాలు, ఆటో మొబైల్స్, ఆటో సర్వీసింగ్, సిల్క్ చీరల తయారీ, పౌల్ట్రీ తదితర యూనిట్లు ఉన్నాయని జీఎం వివరించారు. అర్హులైన నిరుద్యోగ యువకులు www.kviconline.gov.in/pmegeportal లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సదస్సులో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో మధుసూదనాచారి, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, ఉమావతి, సర్పంచ్ హంశ్యామోత్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు, యువకులు పాల్గొన్నారు.