రంగారెడ్డి, జూలై 19, (నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ పనులు తెలంగాణలో అద్భుతంగా జరుగుతున్నాయని ఒకప్పుడు అభినందించిన కేంద్ర బృందాలు… నేడు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. పనుల్లో అవకతవకలు జరిగాయని, ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారని, అధిక సంఖ్యలో కూలీలు హాజరవుతున్నారని, వేరే పనులకు ‘ఉపాధి’ నిధులు మళ్లిస్తున్నారన్న అసత్య ఆరోపణలతో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో ఐదు రోజులపాటు కేంద్ర బృందాలు పర్యటించి ఉపాధి పనులను తనిఖీలు చేశాయి. 2017-18లో చేసిన పనులపై ఆరా తీయగా, చేసిన పనులను, ఫైళ్లను అధికారులు చూపించడంతో కేంద్ర బృందాలు తెల్లమొహం వేసినట్లు తెలిసింది. ఇలా జిల్లాలో విస్తృతంగా పర్యటించినా ఎలాంటి అవకతవకలు కనిపించకపోవడంతో కేంద్ర బృందాలు వెనుదిరిగాయి. లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్న పథకానికి అడ్డంకులు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుండడం బాధాకరమని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నది. ప్రధానంగా భూముల్లేని కూలీనాలీ చేసుకుంటున్న వారికి ఉపాధి హామీ పథకం జీవనోపాధిగా మారగా, భూములున్న రైతులు కూడా పంటల సాగు పూర్తైన వెంటనే ఉపాధి హామీ పనులతో పూట గడుపుతున్నారు. ఏడాది పొడవునా ఉపాధి హామీ పథకంపైనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏవో కొర్రీలు పెట్టి ఉపాధి హామీ పథకం కింద విడుదలయ్యే నిధులను పెద్దఎత్తున తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టి భారీగా అవకతవకలు చేశారనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను తెలంగాణకు పంపించగా.. తనిఖీలు నిర్వహించింది. జిల్లాలో వేసవి సమయంలో రోజుకు 50వేల వరకు కూలీలు హాజరైన పరిస్థితులుండడంతో.. అవకతవకలు జరిగాయనే అనుమానంతో జిల్లాను కేంద్రం టార్గెట్ చేసింది. గతంలో ఉపాధి పనులు భేష్ అన్న కేంద్ర బృందాలు ఇప్పుడు ఉపాధి హామీని నిర్వీర్యం చేసే దిశగా ప్రవర్తించడం సిగ్గుచేటు.
మరోవైపు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ వరకు పనులు జరుగాల్సి ఉన్నా.. వెబ్సైట్ డెవలప్మెంట్ పేరిట మార్చిలోనే పనులు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పేదల కడుపు కొడుతూ.. లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధిని దూరం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రోజుకు ఆరు గంటలు పనిచేయాల్సిందే..
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకుగాను ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలు తప్పనిసరిగా రోజుకు ఆరు గంటలపాటు పనిచేయాలనే కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే యాప్‌లో రోజువారీగా కూలీలు పనిచేస్తున్న ఫొటోలను అప్లోడ్ చేసే ప్రక్రియను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గత రెండు నెలలుగా చేస్తున్నారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరానికి అధిక సంఖ్యలో పని దినాలను కూడా తగ్గిస్తూ నిర్ణయించింది. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి 17 లక్షల పనిదినాలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి బతుకుతున్న లక్షల మంది పేదలు ఉపాధి కోల్పోతున్నారు.
గత ఆర్థిక సంవత్సరం 80.17 లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి మాత్రం 17 లక్షల పనిదినాలకు తగ్గిస్తూ.. 63.09 లక్షల పని దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. కొవిడ్ మొదటి వేవ్ సమయంలో నగరాల్లోని ప్రజలు గ్రామాలకు తరలివెళ్లి ఎలాంటి బతుకుదెరువులేకపోవడంతో ఉపాధి హామీ పనులకెళ్లి తమ కుటుంబాలను పోషించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. జిల్లాలో ప్రతి ఏటా 20 వేల కుటుంబాలకు వంద రోజులపాటు ఉపాధి పనులు కల్పిస్తూ వస్తున్నారు, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 20 శాతం మేర కుటుంబాలకు కూడా వంద రోజులపాటు పని కల్పించడం కష్టంగా మారనుందని సంబంధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతా నిబంధనల ప్రకారమే..
ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలకు విరుద్ధంగా పనులు చేపట్టారని.. అవకతవకలు జరిగాయనే తప్పుడు ఆరోపణలతో జిల్లాలోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో ఐదు రోజులపాటు పర్యటించి ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ఎలిమినేడు గ్రామపంచాయతీల్లో, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని మాజీద్‌పూర్, బాటసింగారం గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఐదు రోజులపాటు గత ఐదేండ్లలో చేసిన పనులన్నీ కిలోమీటర్ల కొద్దీ అటవీ ప్రాంతంలో కలియతిరిగి పనులను పరిశీలించారు. మార్గదర్శకాలకు అనుగుణంగానే పనులు జరిగినట్లు క్షేత్రస్థాయిలో ఉండడంతో కేంద్ర బృందం వెనుతిరిగింది. పనులు సరిగ్గా జరుగలేవని నివేదిక ఇచ్చేందుకుగాను క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం వ్యయప్రయాసలు పడింది. ఇందులో భాగంగా నాలుగేండ్ల క్రితం జరిగిన పనుల వద్దకు వెళ్లి తనిఖీలు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి గ్రామపంచాయతీలో 2017-18లో పూడిక తీసిన చెరువును పరిశీలించి కట్టపై ఎర్రమట్టి ఉందని, పూడిక తీస్తే చెరువులో నల్లమట్టి ఎక్కడికి పోయిందని సిల్లీగా కేంద్రం బృందం ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. నాలుగేండ్ల క్రితం చేసిన పనులను, తదనంతరం సంబందిత చెరువు కట్ట మీదుగా గ్రామపంచాయతీ నిధులతో గతేడాది రోడ్డు వేసినట్లు అధికారులు పనులకు సంబంధిత ఫైళ్లను చూపించగా తెల్లమొహం వేసినట్లు తెలిసింది. పోల్కంపల్లి గ్రామపంచాయతీలో 2018-19లో చేసిన కందకాలను పరిశీలించిన కేంద్ర బృందం 0.5 మీటర్లు ఉండాలి కదా 0.4 ఉంది ఎందుకని అడుగగా.. నాలుగేండ్ల క్రితం జరిగిన పనులు కాబట్టి మట్టి నిండిపోయిందని తెలిపిన అధికారులు.. సంబంధిత కందకాలు తీసిన పనుల ఫైళ్లను కూడా చూపించారు.
మరోవైపు ఎలిమినేడు గ్రామపంచాయతీలో 30 ఎకరాల్లో ఉన్న చెరువుకు సంబంధించి 2017-18లో చేసిన పూడికతీత పనుల్లో పాల్గొన్న జాబ్‌కార్డు కలిగిన కూలీలను తీసుకురావాలని సూచించడం, 30 ఎకరాల్లో ఉన్న చెరువు పూడికతీత పనులను మూడు దఫాల్లో కాకుండా ఒకే దఫాలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సంబంధిత గ్రామంలో కేవలం 345 మంది కూలీలున్నారని, వీరితో ఒకే దఫాలో పనులు పూర్తి చేయడం అసాధ్యమని జిల్లా అధికారులు వెల్లడించారు. మరోవైపు సామాజిక తనిఖీలపై కూడా కేంద్ర బృందం అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విధంగా ఐదు రోజులపాటు తనిఖీలు చేసి నాలుగైదు ఏండ్ల క్రితం చేసిన పనులను కూడా తనిఖీ చేసినా ఎక్కడ కూడా అవకతవకలు జరిగినట్లు గుర్తించకపోవడం గమనార్హం.