బొంరాస్‌పేట, జూలై 19 : 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుకు రెండోసారి బొంరాస్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంపికైంది. జిల్లాలో ఈ అవార్డుకు ఎంపికైన పీహెచ్‌సీల్లో బొంరాస్‌పేట పీహెచ్‌సీని ఉత్తమంగా గుర్తించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, దవాఖానలో సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని 75.30 శాతం మార్కులతో కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద దవాఖానకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలను మంజూరు చేస్తుంది. ఈ నిధులను దవాఖాన అభివృద్ధికి, సౌకర్యాలను మెరుగుపర్చడానికి వినియోగించుకోవచ్చు. పీహెచ్సీ కాయకల్ప అవార్డుకు ఎంపిక కావడంపై వైద్య సిబ్బంది, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019-20లో కూడా పీహెచ్సీ మొదటిసారి కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. 2021లో ఎన్‌క్వాస్ సర్టిఫికేషన్ వచ్చింది.
పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో పీహెచ్సీ
బొంరాస్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పచ్చని చెట్లు విరివిగా ఉన్నాయి. కొన్నేండ్ల నుంచి పీహెచ్సీలో నాటిన మొక్కలు ఏపుగా పెరుగడంతో ఆవరణ అంతా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. వేసవిలో కూడా చల్లటి గాలులతో సిబ్బంది, రోగులు సేద తీరుతున్నారు. ఆవరణలో రోగులు, వారి వెంట వచ్చిన వారు కూర్చోవడానికి దవాఖాన అభివృద్ధి నిధుల నుంచి ఇటీవల సిమెంటుతో తయారు చేసిన బెంచీలను తెప్పించారు. పీహెచ్సీ లోపలి భాగంలో కూడా ప్రైవేటు దవాఖానలో ఉండే మాదిరిగా రిసెప్షన్ కౌంటర్, బ్యాండేజీ గది, ఆరోగ్యమిత్ర విభాగం, ఫార్మసీ విభాగం.. ఇలా విభజన చేశారు. నేలపై ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా మ్యాట్‌ను పరిచారు. రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.26 వేలతో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీకి ఆనుకుని అదనంగా ఒక గదిని నిర్మించారు. ఇన్‌పేషంట్ రోగులకు బెడ్లు కూడా నీట్‌గా ఉంచారు. కొత్తవారు ఎవరైనా పీహెచ్‌సీకి వస్తే ఇది సర్కారు దవాఖానేనా అని ఆశ్చర్యపోకమానరు.
కాన్పులకు పెరిగిన స్పందన
పీహెచ్సీలో కాన్పులు చేయించుకునేవారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో పెరిగింది. ఒకప్పుడు సర్కారు దవాఖానల్లో కాన్పులంటేనే మహిళలు భయపడేవారు. కానీ ఇప్పుడు సర్కారు దవాఖానలకు వెళితేనే సుఖ ప్రసవాలు అవుతున్నాయని పేదలు నమ్ముతున్నారు. బొంరాస్‌పేట పీహెచ్సీలో ప్రతి నెలా 20 వరకు కాన్పులు జరుగుతున్నాయి. రోజూ 100 మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తున్నారు.
2021లో ఎన్‌క్వాస్ సర్టిఫికేషన్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2021లో ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ లభించింది. రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, దవాఖానలో పాటిస్తున్న పరిశుభ్రత, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో చాలా మెరుగ్గా ఉన్న దవాఖానలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్‌క్వాస్ సర్టిఫికేషన్ ఇస్తుంది. దీనికి ఎంపికైన పీహెచ్‌సీకి కేంద్రం ఏటా రూ.3లక్షల నిధులను మూడేండ్లపాటు మంజూరు చేస్తుంది.
ఈ నిధుల్లో 75 శాతం దవాఖాన అభివృద్ధికి, మిగతా 25 శాతం సిబ్బందికి ఇన్సెంటివ్ రూపంలో అందజేస్తారు. గత ఏడాది జనవరిలో కేంద్ర అధికారుల బృందం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వసతి సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించింది. పీహెచ్సీ పనితీరు బాగుండడంతో కేంద్ర బృందం 84 మార్కులు కేటాయిస్తూ 2020-21 సంవత్సరానికి బొంరాస్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్‌క్వాస్ సర్టిఫికేషన్‌ను జారీ చేసింది.
గర్వంగా ఉంది
– రవీంద్ర యాదవ్,జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి
వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు మండల ప్రజల సహకారం వల్లే పీహెచ్సీ కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇదే స్ఫూర్తితో దవాఖానను అభివృద్ధి చేసి రోగులకు మెరుగైన వైద్యం అందిస్తాం.