ఇబ్రహీంపట్నం, జూలై 19 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ నెల 23న మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి రూ.29.05కోట్ల అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. మంత్రుల పర్యటన ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నాయకులు, అధికారులతో ఎమ్మెల్యే మంగళవారం క్యాంపు కార్యాలయంలో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఒక్కరోజు ముందే ఆయన పర్యటన ఖరారు కావటంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం చెరువుకట్ట నుంచి బీడీఎల్, ఇండస్ట్రియల్ క్లస్టర్పార్కుకు రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన నాలుగులేన్ల రహదారి, రూ.4.20 కోట్ల తో నిర్మించిన ఎస్టీ గురుకుల కళాశాల భవనాన్ని రూ.2.15కోట్ల వ్యయంతో నిర్మించిన పోస్ట్‌మెట్రిక్ కళాశాల వసతిగృహం, రూ.2.5 కోట్లతో నిర్మించిన కస్తూర్బా విద్యాలయం నూతన భవనాన్ని, రూ.2. 87 కోట్లతో మార్కెట్‌యార్డులో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో 500 మందితో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగాపల్లి-జాపాల మధ్య అడవిలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్‌గౌడ్, చీరాల రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి పాల్గొన్నారు.