రంగారెడ్డి, జూలై 18(నమస్తే తెలంగాణ);ధాన్యంపై కేంద్రం అవలంబిస్తున్న వైఖరి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నది. కొన్ని నెలలుగా ధాన్యం కస్టమ్ మిల్లింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో టన్నులకొద్దీ ధాన్యం రైస్ మిల్లుల్లోనే మూలుగుతున్నది. వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో 82,900 మెట్రిక్ టన్నుల ధాన్యంతోపాటు 2021 వానకాలానికి సంబంధించి 30శాతం బియ్యం కూడా మిల్లర్ల వద్దే ఉండిపోయాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 29,400 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో ఉన్నది. దండిగా ధాన్యం సేకరణతో స్థలం కొరత ఏర్పడి చాలాచోట్ల మిల్లుల ప్రాంగణాల్లోనే ధాన్యాన్ని నిల్వ చేశారు. దీంతో వర్షాలకు తడిసి మొలక రావడంతో ధాన్యం పనికిరాకుండా పోతున్నది. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో భారీస్థాయిలో నష్టం వాటిల్లుతున్నది. దీనిపై మిల్లర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించడం వల్ల సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్‌మిల్లుల్లో మూలుగుతున్నది. కేంద్రం ససేమిరా అన్నప్పటికీ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించగా, కస్టమ్ మిల్లింగ్‌కు కేంద్రం ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడంతో రైస్‌మిల్లుల్లోనే వడ్లు ఉండిపోయాయి. గత యాసంగి సీజన్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లతో పాటు 2021 వానకాలం వడ్లకు సంబంధించిన 30 శాతం బియ్యం ఇప్పటికే మిల్లర్ల వద్దే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వడ్ల కస్టమ్ మిల్లింగ్ ఆగిపోయింది.
యాసంగి వడ్లు 82,900 మెట్రిక్ టన్నులు..
వికారాబాద్ జిల్లా పరిధిలో గత యాసంగికి సంబంధించి ప్రభుత్వం వివిధ ఏజెన్సీలతో రైతుల వద్ద నుంచి వడ్లు కొనుగోలు చేసింది. జిల్లాలో 108 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం19,686 మంది రైతుల వద్ద నుంచి 82,900 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకుగాను గ్రేడ్ ‘ఏ’ రకానికి క్వింటాలుకు రూ.1960, కామన్ రకానికి రూ.1940 చొప్పన మద్దతు ధరతో రూ.162.45 కోట్లను వెచ్చించి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. కస్టమ్ మిల్లింగ్ కోసం వరి ధాన్యాన్ని జిల్లాలోని 58 రైస్‌మిల్లులకు కేటాయించారు. దీంతో కొనుగోలు కేంద్రాల నుంచి నేరుగా రైస్‌మిల్లులకు ధాన్యాన్ని చేరవేశారు. ఇక్కడివరకు అంతా బాగున్నా ఆ తర్వాత అసలు సమస్య వచ్చింది.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రం నుంచి బియ్యం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బియ్యం సేకరణకు సంబంధించిన లేఖ రాకపోవడంతో వరి ధాన్యం రైస్‌మిల్లుల్లోనే ఉండిపోయింది. ఈసారి సైతం పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు గత వానకాలానికి సంబంధించిన ధాన్యం కొంత సంబంధిత రైస్‌మిల్లుల్లోనే ఉండిపోవడంతో ఎక్కడ స్థలం ఉంటే అక్కడే ధాన్యం బస్తాలు వేసి కవర్లు, టార్పాలిన్లు కప్పి ఉంచారు.
యాసంగితోపాటు గత సంవత్సరం వానకాలంలో ప్రభుత్వం 1,14,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్‌కు రైస్‌మిల్లర్లకు ఇచ్చింది. సుమారు రూ.220 కోట్లకు పైగా డబ్బులు వెచ్చించి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ప్రతి క్వింటాలు వరి ధాన్యానికి 67 కిలోల చొప్పున బియ్యం సంబంధిత రైస్‌మిల్లర్లు అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేసి 70 శాతం బియ్యం ఎఫ్‌సీఐ గోదాములకు చేరవేశారు. అంతలోనే ఎఫ్‌సీఐ బియ్యం ఇండెంట్లు పెట్టకపోవడం నిలిపివేసింది. తద్వారా మిగతా 30 శాతం సీఎంఆర్ బియ్యం రైస్‌మిల్లుల్లోనే ఉండిపోయాయి.
కేంద్రం తీరుతో తీవ్ర నష్టం
ఓవైపు యాసంగి పంటల సాగుకు ముందు ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పగా, మీరు వేయండి మేము కొనిపిస్తామంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను తప్పుదోవ పట్టించారు. అప్పట్లో వరి వేయవద్దని ప్రభుత్వం సూచించినా మీరు వేయండంటూ రైతులను రెచ్చగొట్టిన బీజేపీ నాయకులు ఇప్పుడు నోరు మెదపడం లేదు. మరోవైపు యాసంగి వడ్లు నూకలవుతాయి, కావాలంటే మీ ప్రజలచే నూకలు తినిపించండి, మేము కొనుగోలు చేయబోమని చెప్పిన కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఇటీవల వరి సాగును ప్రోత్సహించాలని ప్రకటించడం హాస్యాస్పదం. పొంతనలేని ప్రకటనలు, సరైన దృక్పథం లేని కేంద్ర విధానాలతో కోట్లాది రూపాయలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలుగకుండా తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేసింది. యాసంగి వడ్లు రైస్‌మిల్లర్లు స్థలం ఉన్నచోట వేయడంతో ఇటీవల కురిసిన తెరిపిలేని వర్షానికి తడిసిపోయి బస్తాల నుంచే వరి ధాన్యం మొలకలెత్తింది. తద్వారా రైస్‌మిల్లర్లు సైతం నష్టపోయే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంత భారీ వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోతున్నా ఇప్పటివరకు బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ వేదికగా పోరాటానికి సిద్ధమైంది. కేంద్రం వైఖరిని ఎండగడుతూ ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానానికి, కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ అనంతరం బియ్యం సేకరణపై పట్టుబట్టనున్నది.
కేంద్రం వైఖరి సరికాదు..
వ్యవసాయం, రైతుల విషయంలో కేంద్రం వైఖరి సరైనదికాదు. అన్నదాతలు ఆగంకావద్దని రాష్ట్ర సర్కార్ ధాన్యం కొనుగోలు చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంది. బీజేపీ సర్కారు నిర్లక్ష్యం వల్లనే రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం మొలకెత్తింది.
– రామకృష్ణ యాదవ్, రైతు, బొంరాస్‌పేట
కేంద్రం కొనకున్నా సీఎం కేసీఆర్ కొన్నారు..
యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా, సీఎం కేసీఆర్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం కేంద్రం బియ్యం తీసుకోవాల్సి ఉండగా, నేటికీ తీసుకోవడం లేదు. ఫలితంగా మిల్లుల్లో ధాన్యం మొలకెత్తుతున్నది.
– మాసుల బసిరెడ్డి, రైతు దుద్యాల, బొంరాస్పేటమండలం
బీజేపీ రైతులకు వ్యతిరేకం..
కేంద్రంలోని బీజేపీ రైతులకు వ్యతిరేకంగా పని చేస్తున్నది. ధాన్యం కొనడంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం కొని మిల్లుల్లో నిల్వ చేసింది. కేంద్రం జాప్యం వల్ల మొలకెత్తుతున్నాయి. ఇప్పటికైనా మిల్లుల్లోని ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి.
– తులసీరాం, రైతు, దేవులానాయక్తండా, బొంరాస్‌పేట మండలం