ఇబ్రహీంపట్నం, జులై 16 : హరిత ఇబ్రహీంపట్నంగా తయారు చేయటమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం అటవీశాఖ, మున్సిపల్, మండల పరిషత్, ఉపాధిహామీ, గ్రామ పంచాయతీల అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని జిల్లాలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈనెల 23న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా కాగజ్‌ఘాట్ జాపాల మధ్యలోని అటవీ ప్రాంతంలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యమ్రాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు తమ వంతు కృషి చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో పదివేల మొక్కల చొప్పున నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి మొక్కలను సరఫరా చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. మొక్కలకు నీటిని అందించడంతో పాటు వాటి సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసేందుకు దాతల సహకారం తీసుకోవాలన్నారు. సమావేశంలో అటవీశాఖ రేంజ్ అధికారి విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్లు యూసఫ్, అమరేందర్, రామాంజనేయరెడ్డి, జ్యోతి, ఎంపీడీవోలు మమతాబాయి, విజయలక్ష్మి, ఎంపీవో తేజ్‌సింగ్, ఉపాధిహామీ ఏపీవోలు లింగయ్య, వీరాంజనేయులు, ఎంపీవో లక్పతినాయక్ తదితరులు పాల్గొన్నారు.