రంగారెడ్డి, జూలై 16, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఎనిమిదేండ్లలో రహదారుల నిర్మాణానికి, మరమ్మతులకుగాను రూ.వందల కోట్ల నిధులను ఖర్చు చేసింది. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామపంచాయతీల వరకు లింక్ రోడ్లను నిర్మించారు. రహదారుల నిర్మాణంతోపాటు వంతెనల నిర్మాణానికీ నిధులు వెచ్చించింది. గతంలో వానకాలం వస్తే చాలు, వాగులు పొంగిపొర్లి రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితి ఉండేది. వరదలతో రహదారులు కొట్టుకుపోయి గ్రామాలకు వారం, పది రోజులు రవాణా బంద్ అయ్యేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వాగులపై వంతెనలను నిర్మించింది. జిల్లాలో ప్రధానమైన మూసీ, ఈసీలతోపాటు ఆయా ప్రాంతాల్లోని ప్రధాన వాగులు, మారుమూల పల్లెల్లోని వాగులపై బ్రిడ్జిలను నిర్మించడంతో ప్రజలకు కష్టాలు తప్పి రవాణా సాఫీగా సాగుతుండడం గమనార్హం.
రూ.300 కోట్లతో వంతెనల నిర్మాణం..
జిల్లాలో ఎనిమిదేండ్లుగా వంతెనల నిర్మాణానికిగాను సుమారు రూ.300 కోట్ల వరకు ప్రభుత్వం నిధులు వెచ్చించింది. మారుమూల పల్లెల్లో సహితం వాగులపై వంతెనలను నిర్మించి రవాణ వ్యవస్థను బలోపేతం చేసింది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని 111 రెవెన్యూ గ్రామాల్లో రవాణా వ్యవస్థ సజావుగా సాగుతున్నది. కొందుర్గు మండలంలో చొక్కంపేట గ్రామానికి వెళ్లే దారిపై రూ. 1.95 కోట్ల నిధులతో వంతెన నిర్మించారు. ఉమ్మడి కొత్తూరు మండలంలో మల్లాపూర్ గ్రామంలో రూ. 2.44 కోట్లు, చేగూరు గ్రామానికి వచ్చే ప్రధాన దారుల్లో రూ.1.25 కోట్లు, రూ.1.65 కోట్లు, రూ.1.90 కోట్లు నిధులను వెచ్చించి మూడు వంతెనలను నిర్మించారు. బుగ్గొనిగూడ గ్రామపరిధిలో రూ.1.21 కోట్ల నిధులతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు.
కేశంపేట మండలంలో లింగారావుపల్లి గ్రామానికి వెళ్లే దారిలో రూ.1.80 కోట్ల నిధులతో వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలోని మక్తగూడ గ్రామంలో రూ.2.30కోట్లతో, రూ.కోటితో మాచన్‌పల్లి-పోలారం రోడ్డులో వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. మరోవైపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ వానకాలంలో వాగును దాటి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. నియోజకవర్గంలోని పోచారం, కర్ణంగూడ గ్రామాల మధ్య వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.2.88కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 18 కల్వర్టులను ప్రభుత్వం నిర్మించింది.
వాగు దాటాలంటే కష్టంగా ఉండేది..
ఇదివరకు కేశంపేట సమీపంలోని వాగు దాటాలంటే కష్టంగా ఉండేది. బ్రిడ్డి నిర్మాణంతో పొలాలకు వెళ్లే రైతులకు, రామకృష్ణాపురం, లింగరావుపల్లి, తలకొండపల్లి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పాయి.
-టి.నారాయణరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్, షాద్‌నగర్