పెద్దేముల్, జూలై 15: మండలంలోని జనగాం గ్రామ శివారు సర్వేనంబర్ 92/అ లో ఉన్న సాయిబాబా కాటన్మిల్లో భారీ చోరీ జరిగింది. రూ.12 లక్షల విలువ చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని 850 కేజీల కాపర్ వైరు, 350 లీటర్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్‌ను గుర్తుతెలియని దొంగలు తస్కరించిన ఘటన శుక్రవారం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయిబాబా కాటన్‌మిల్ నిర్వాహకులు అల్లెంకల సంతోశ్‌కుమార్, ఎండీ.నయీంబాబా, ఎండీ. ఫయాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం గ్రామ శివారులోని సర్వేనంబర్ 92/అలో ఉన్న వ్యవసాయ భూమి లో రెండేండ్ల క్రితం పెద్దేముల్ గ్రామానికి చెందిన సంతోశ్‌కుమార్, ఎండీ. నయీంబా బా, ఎండీ.ఫయాజ్, తాండూరుకు చెందిన సురేశ్ కలిసి సాయిబాబా కాటన్ ఇండస్ట్రీస్ పేరుతో కాటన్మిల్ను ఏర్పాటు చేసి అందు లో సిరిగిరిపేటకు చెందిన రాములును వాచ్‌మన్‌గా పెట్టుకున్నారు.
కాగా మిల్ నిర్వహణలో నష్టాలు వస్తున్న నేపథ్యంలో వారు సొంతంగా నడపకుండా వేరే వ్యాపారులకు లీజుకు ఇచ్చారు. లీజుకు తీసుకున్న వారు ఆ మిల్‌ను వినియోగించుకుని తర్వాత నిర్వాహకులకు అప్పగించారు. కాటన్ మిల్లోని 500 కేవీఏ కెపాసిటీ గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్‌కు బిల్లు అధికంగా వస్తుండటంతో నిర్వాహకులు ఈ ఏడా ది ఏప్రిల్ నెలలో ఆ కనెక్షన్‌ను తొలగించారు. వారం, పది రోజులకొకసారి నిర్వాహకులు ఆ మిల్కెళ్లి పర్యవేక్షిస్తున్నారు.
కాగా శుక్రవారం ఉదయం వాచ్‌మన్ రాములు నిద్రలేచి చూసేసరికి కాటన్ మిల్లోని 500 కేవీఏ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్ విడి భాగాలుగా విడగొట్టబడి ఉన్నది. దానికి వేసిన కంచె ఓ పక్క కు ఒరిగింది. అందులోని 850 కేజీల కాపర్ వైరు, 350 లీటర్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్‌ను గుర్తుతెలియని దొంగలు తస్కరించారు. నిర్వాహకులు మిల్కు వచ్చి పరిశీలించారు. 500 కేవీఏ గల ట్రాన్స్ఫార్మర్ విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రవూఫ్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.