పరిగి, జూలై 15: ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులను వివక్ష లేకుండా సమర్థవంతంగా పరిష్కరిస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2021లో జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 54 కేసులను నమోదు చేసి సంబంధిత బాధితులకు రూ.59 లక్షల నష్టపరిహారాన్ని అందించినట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదైన 47 కేసులకు రూ.29.75 లక్షలను నష్టపరిహారం కింద మంజూరు చేశామన్నారు. ఈ ఏడాది మే నెలాఖరు వరకు 14 కేసులు నమోదు కాగా.. బాధితులకు రూ.13.22 లక్షలు మంజూరైనట్లు ఆమె వివరించారు. ప్రతినెలా నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాల్లో పౌర హక్కుల దినాన్ని క్రమం తప్పకుండా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరిం చారు.
పరిహారం, పునరావాసం విషయంలో ఆలస్యం జరుగకుండా చూడాలని సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. సభ్యులు సూచించిన ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల విషయంలో త్వరలో జరిగే రెవెన్యూ సదస్సుల్లో న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామాలను ఫైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని చెప్పారు. కొన్ని అనివార్య కారణాలతో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నదని వారు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో కేసులను పరిష్కరించాలని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల విషయంలో పురోగతిని సాధిస్తూ నేరస్తులకు శిక్షలు పడేలా చూస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు కళాబృందాలతో గ్రామాల్లో కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. సమావేశంలో డీవీఎంసీ సభ్యులు, ర్యాడ్ సొసైటీ ఈడీ సత్యవతి, దళిత, స్త్రీ శక్తి కో-ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి, సభ్యులు రాములు, యాదయ్య, రమేశ్, అడ్వకేట్ బాల్య, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, దశరథ్, వికారాబాద్, తాండూరు డీఎస్పీలు, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.