షాబాద్, జూలై 10: పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మారాయి. ఇందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకీ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను కొనుగోలు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం సత్ఫలితాలనిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 558 గ్రామపంచాయతీల్లోనూ కొనుగోలు చేసిన ట్రాక్టర్లతో బహుళప్రయోజనాలు చేకూరుతున్నాయి. నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నాయి. ట్రాక్టర్‌కు ట్యాంకర్‌ను వేసుకుని మొక్కలకు నీళ్లను పట్టడంతో పాటు గ్రామానికి చెందిన ఇతర పనులకు వినియోగిస్తుండడంతో ఖర్చులన్నీ తగ్గాయి. పారిశుధ్యం, హరితహారానికి ట్రాక్టర్ కీలకంగా మారడం విశేషం. ఇదివరకు మొక్కలకు నీళ్లు పట్టడం, మొక్కలు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్ కిరాయి వంటి ఖర్చులను ఉపాధి హామీ నుంచి కేటాయించేవారు. ప్రస్తుతం ఆ నిధులను జీపీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ట్రాక్టర్‌తో గ్రామపంచాయతీకి ఆదాయం కూడా సమకూరుతుండడంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం గ్రామీణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసింది. ట్రాక్టర్ కొనుగోలుతో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతున్నది. ఒక ట్రాక్టర్ పల్లెల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ప్రతి పంచాయతీలోనూ కొనుగోలు చేసిన ట్రాక్టర్‌తో గ్రామాల రూపురేఖలను మార్చివేస్తుంది. పారిశుధ్యం, హరితహారానికి కీలకమై, క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దుతున్నది. ఇండ్ల నుంచి చెత్త సేకరించడమే కాకుండా.. మొక్కలకు నీళ్లు సరఫరా చేస్తూ పచ్చదనం పెంపునకు తోడ్పడుతున్నది. నాడు చెత్త సేకరణ, మొక్కలకు నీళ్లు పట్టడం కోసం ప్రైవేట్ వాహనాలకు ఉపాధిహామీ నిధులు చెల్లించినా.. నేడు సొంతంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను ఉపయోగిస్తుండడంతో పంచాయతీలకు ఆదాయం సమకూరుస్తున్నది. ప్రతి జీపీకి తప్పనిసరిగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలని సీఎం తీసుకున్న నిర్ణయంతో నేడు ప్రతి పల్లె పచ్చదనం.. పరిశుభ్రతతో ఆదర్శంగా నిలుస్తుంది.
రంగారెడ్డిజిల్లాలో 558 పంచాయతీలు
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 558 గ్రామ పంచాయతీలున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికీ ఒక ట్రాక్టర్ కొనుగోలు చేశారు. గతంలో చెత్తాచెదారం, దుర్గంధం వ్యాపించిన పల్లెల్లో నేడు పరిశుభ్రత నెలకొన్నది. గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ కొనుగోలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తున్నది. పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్లతో గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. చెత్త తరలింపు, మొక్కలకు నీళ్లు పట్టడం వంటి ముఖ్యమైన పనుల్లో ట్రాక్టర్లను వినియోగిస్తుండడంతో ఖర్చు ఆదా అవడమే కాకుండా ఉపాధిహామీ ద్వారా వస్తున్న నిధులతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. గతంలో మొక్కలకు నీళ్లు పట్టేందుకు ఒక్కో ట్రిప్పునకు రూ. 600 చొప్పున ప్రైవేట్ ట్యాంకర్లకు చెల్లించాల్సి వచ్చేది. చెత్త సేకరణకు ఉపయోగించే ట్రాలీలకు కూడా అద్దె చెల్లించాల్సి వచ్చేది. వీటిని ఉపాధిహామీ నిధుల నుంచి వెచ్చించేది. కానీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీలు సొంతంగా ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశాయి. వీటితోనే ఇప్పుడు పనులు చేయిస్తున్నారు.
మారిన పల్లెల రూపురేఖలు
జిల్లా వ్యాప్తంగా పంచాయతీల ట్రాక్టర్లతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి. పరిశుభ్రత, పచ్చని చెట్లతో గ్రామాలన్నీ కొత్తశోభను సంతరించుకున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లతో చెత్త సేకరణతో పారిశుధ్యం మెరుగుపడింది. ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు పడుతుండగా పల్లెల్లో పచ్చదనం పరుచుకున్నది. ప్రతి రోజూ ఇండ్ల నుంచి సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో నాటాల్సిన మొక్కలను ఇతర ప్రాంతాలను నుంచి తీసుకురావాలన్నా టాక్టర్ ఉపయోగపడుతున్నది. నెలలో నాలుగు విడుతలు మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీళ్లు పడుతుండగా ఒక్కో ట్యాంకర్‌కు రూ. 600 చొప్పున ఉపాధిహామీ నిధులను జీపీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో పల్లెల రూపురేఖలు మారిపోతుండడంతో పాటు జీపీలకు ఆదాయం సమకూరడంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామం శుభ్రంగా మారుతున్నది
ప్రభుత్వం ప్రతి జీపీకీ ట్రాక్టర్ కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో నూతనంగా ఏర్పాటైన తమ మా గ్రామానికి ట్రాక్టర్ కొనుగోలు చేశాం. ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా గ్రామంలో చెత్త సేకరణ చేపట్టడంతో గ్రామం మొత్తం శుభ్రంగా మారుతుంది. అదే విధంగా ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరు పట్టిస్తున్నాం. ట్రాక్టర్ ద్వారా ఓ వైపు పారిశుధ్యం, మరో వైపు పచ్చదనం పనులు చేపట్టడంతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
– కుమ్మరి దర్శన్, సర్పంచ్, సంకెపల్లిగూడ
జీపీ పనులకు ఉపయోగం
గతంలో మొక్కలకు నీళ్లు పోయాలంటే ఒక్క ట్యాంకర్‌కు రూ.600ఖర్చు అయ్యేది. పక్క గ్రామం నుంచి హరితహారం మొక్కలు తీసుకురావాలంటే ట్రాక్టర్ కిరాయి రూ. 1500వరకు ఖర్చు అయ్యేది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ప్రతి జీపీకీ ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ రావడంతో ఈ ఖర్చులన్నీ తప్పాయి. మొక్కలకు నీళ్లు పోయడంతో సుమారు 90శాతం వరకు మొక్కలు బతుకుతున్నాయి. – పి.కేతనారమేశ్యాదవ్, సర్పంచ్, కుమ్మరిగూడ (షాబాద్)