కోట్పల్లి, జూలై 10 : దళితుల జీవిత్లాలో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకం జిల్లాలోని కోట్పల్లి మండలంలో వేగంగా అమలు అయింది. తొలి విడుతలో మండలంలో 17మందిని ఎంపిక చేయగా, ఇప్పటి వరకు 15మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో కోటీ 50లక్షలు జమ చేశారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి 10వేల చొప్పున రక్షణ నిధికి లక్షా 50వేలు జమ చేశారు. ఇందులో 15 మంది లబ్ధిదారులకు గ్రౌండింగ్ పూర్తి చేసి యూనిట్లను అందించారు. యూనిట్లపై లబ్ధిదారులకు శిక్షణతో పాటు, అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు అందించిన యూనిట్లలో ట్రాక్టర్లను పంపిణీ చేశారు. మండలంలో దళిత బంధు అందుకున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంచుకున్న వ్యాపారంలో ఎలాంటి నష్టం వాటిల్లినా వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రక్షణ నిధి భరోసా కల్పించనున్నది. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు లబ్ధిదారులకు యూనిట్లను అందించారు. 17 మంది లబ్ధిదారుల్లో 15 మందికి యూనిట్లను అందించగా, మరో ఇద్దరికి త్వరలోనే అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కోరుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేశాం
దళితబంధు పథకం కింద లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేశాం. మండలంలో 17 మంది లబ్ధిదారులకు 15 మందికి అందించాం. తాండూరు నియోజకవర్గానికి సంబంధించి 6, వికారాబాద్ 11 మంది మొత్తం 17 మందిని ఎంచుకున్నాం. మిగతా 2 యూనిట్ల నిధులు త్వరలో విడుదల కానున్నాయి.
– లక్ష్మీనారాయణ, ఎంపీడీవో కోట్పల్లి
ఆర్థిక ఇబ్బందులు తొలగాయి..
ఆర్థిక ఇబ్బందులు తొలిగించేందుకు ప్రభుత్వం దళితబంధును అమలు చేయడం సంతోషంగా ఉంది. మొదటి విడుతలో ఎంపిక చేసి నాకు ట్రాక్టర్ను అందించారు. ఆర్థికంగా బలపడేందుకు నాకు ఎంతో ఉపయోగంగా ఉంది. ఆర్థిక తొలగాయి. సీఎం కేసీఆర్ దళితబంధుతో దళితుల ఇండ్లల్లో సంతోషాన్ని నింపారు. గ్రామాలు, పట్టణాల్లో దళితులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా దళితబంధు ప్రవేశపెట్టారు. ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.
– గడ్డం అనిల్, గ్రామం కోట్పల్లి