యాచారం, జూలై 10 : తెలంగాణకు హరితహారంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కూలీలతో ముమ్మరంగా గుంతలు తీయిస్తున్నారు. ఇప్పటికే మండలంలో హరితహారం సత్ఫలితాలిస్తున్నది. ప్రతి పల్లెలో పల్లె ప్రకృతివనాలు, మండల కేంద్రంలో బృహత్ ప్రకృతివనాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి. రోడ్లపై నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ ఏడాది కూడా లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
హరితహారం ద్వారా మరిన్ని మొక్కలు నాటి మరింత పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈజీఎస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ప్రతి గ్రామంలో నర్సరీల ద్వారా మొక్కలు సిద్ధం చేస్తున్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా మండలంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఈ ఏడాది హరితహారాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. మండలంలోని 24గ్రామపంచాయతీలకు 24 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ప్రతి నర్సరీలో 18,000ల మొక్కల చొప్పున 4.32లక్షల మొక్కలను పెంచుతున్నారు.
24నర్సరీల్లో మొక్కల పెంపకం..
మండలంలోని 24గ్రామపంచాయతీల్లో ఊరికో నర్సరీ చొప్పున 24నర్సరీల్లో ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో హరితహారం కోసం పండ్లు, పూలు, కలపనిచ్చే వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. మండలంలో 24నర్సరీల్లో 4లక్షల32వేల మొక్కలను లెక్క తప్పకుండా సంరక్షిస్తున్నారు. జామ, నిమ్మ, టేకు, వేప, మునగ, కానుగ, అల్లనేరేడు, దానిమ్మ, బొప్పాయి, కృష్ణతులసి, సీతాఫల్, తుర్కవేప, చింత, గన్నేరు, గోరింటాకు, మందార, చామంతి, ఉసిరి, టెకోమ, బొంగన్మిలియా, గ్లిరిసిడియా, గంగరావి, గుల్మొహర్, రైయిన్ట్రీ, చిన్నబాదం, మల్బరి, ఫెల్ఫామ్ తదితర మొక్కలతో పాటుగా పలు రకాల పండ్ల మొక్కలను హరితహారంలో నాటేందుకు సిద్ధంగా ఉంచారు. మొక్కలు పూర్థి స్థాయిలో నాటి లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నర్సరీల్లో 4.32లక్షల మొక్కలు సిద్ధం
హరితహరం కింద నాటేందుకు ఈజీఎస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో 24నర్సరీల్లో మొత్తం 4.32లక్షల మొక్కలు పెంచుతున్నట్లు ఏపీవో లింగయ్య తెలిపారు. ఇందులో జామ 37,940, నిమ్మ 16,850, దానిమ్మ 3,500, మందారం4,950, కనకాంబరం 7,900, కజ్జూర 5,000, కరివేపాకు 3,500, గోరింటాకు 3,100, నేరేడు 5,000, సీతాఫల్ 27,400, రావి 2,700, పెల్టోఫోరమ్ 1,500, టేకు 42,000, వేప 4,000, గుల్మొహర్ 25,900, కానుగ 9,520, కుంకుడు 13,800, మల్బార్ వేప 4,500, పచ్చ గన్నేరు 11,490, వెదురుబొంగు 13,520, చింత 5,200, మునగ 4,000, కొనోకార్పస్ 4,000, టెకోమ 17,820, తులసి 500, చీమచింత 14,830, బొబ్బాయి 4,900, గన్నెరు11,490, ఇతర మొక్కలు 1,11,690 మొక్కలను పెంచుతున్నారు.
హరితహారం టార్గెట్‌పై దృష్టి
మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటి టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఖాళీ స్థలాలను గుర్తించడం కోసం క్షేత్ర స్థాయిలో ఉపాధి సిబ్బంది, అధికారులు సమీక్షిస్తున్నారు. మండలంలోని ఖాళీ స్థలాలు, కమ్యూనిటీ హాల్స్, చెరువు గట్లు, బస్స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రోడ్లు, ప్రార్థనా మందిరాలు, శ్మశానవాటికలు, అటవీభూములు, బంజరు భూములు, రైతు పొలాలు, గట్లు తదితర స్థలాల్లో హరితహారం మొక్కలు నాటడానికి అధికారులు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. హరితహారం మొక్కలు నాటే ముందు గుర్తించిన స్థలాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.
లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
హరితహారం కింద మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి నర్సరీలో 18,000 మొక్కల పెంపకం చొప్పున 4.32లక్షల మొక్కలను పెంచుతున్నాం. వర్షాలు కురుస్తున్నందున హరితహారానికి మొక్కలు సిద్ధం చేశాం. అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటేందుకు గుంతలను తీయిస్తున్నాం. 24నర్సరీల్లో 4.32లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రైతులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పౌరులు సహకరించాలి.
– విజయలక్ష్మి, ఎంపీడీవో