పరిగి/ఇబ్రహీంపట్నం, జూలై 10: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు నిఖిల, అమయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ల్లో కురుస్తున్న వర్షాల స్థితిగతులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమేశ్‌కుమార్‌కు వివరించారు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, సీసీవో ఓంప్రకాశ్, ఇతర అధికారులున్నారు.
తహసీల్దార్లకు దిశానిర్దేశం
అనంతరం వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. గ్రా మాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్ల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ, ఎంపీడీవోలు, పోలీసు సిబ్బంది, పంచాయతీరాజ్, నీటి పారుదల, ఆర్అండ్బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా శాఖల వారీగా 24 గంటలపాటు విధు లు వేసి సంబంధిత ఆర్డర్ కాపీలను తమకు పంపించాలని వారు ఆదేశించారు. చెరువులు, కాలువలు ఉధృతంగా ప్రవహించే ప్రాంతాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేసి అక్కడ సిబ్బందిని ఉంచాలని, గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లు అధికారులకు సూచించారు.