రంగారెడ్డి, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహంతో కులవృత్తులకు పూర్వవైభవం వస్తున్నది. మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు, గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నది. మొదటి విడుతలో సబ్సిడీపై అందించిన గొర్రెలతో చాలామంది గొల్లకురుమల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. ఏడు ఈతల గొర్రె పిల్లలు, ఉన్నితో ఆర్థికంగా లబ్ధి పొందారు. ఒక్కో కుటుంటానికి రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరగా.. జిల్లావ్యాప్తంగా రూ.500 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి మందకూ 30 గొర్రెలు అదనంగా పెరిగినట్లు తెలిపారు. మరోవైపు రెండో విడుత పంపిణీకి ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. జిల్లావ్యాప్తంగా 21 వేల మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం రూ.250 కోట్లతో గొర్రెలను కొనుగోలు చేయనున్నారు.
ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలతో కులవృత్తులకు పూర్వవైభవం వస్తున్నది. కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకోసం గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నది. మొదటి విడుతలో సబ్సిడీపై గొర్రెలను పొందిన గొల్ల, కురుమల కుటుంబాలు ఆర్థికాభివృద్ధి చెందా యి. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరగా.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం నుంచి సబ్సిడీపై గొర్రెలను పొందిన లబ్ధిదారులు దాదాపుగా రూ.500 కోట్ల వరకు ఆదాయాన్ని పొందినట్లు అధికారు లు పేర్కొంటున్నారు. గొల్ల, కురుమలు ఆర్థికంగా ఎదుగడంతోపాటు ప్రతి మందకూ 30 గొర్రె పిల్లలు కూడా పెరిగినట్లు చెబుతున్నారు.
కూలీ పనులు చేసుకుని బతుకుతున్న గొల్ల, కురుమలకు గొర్రెలను ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తుండటంతో ఆ కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయి. కాగా రెండో విడుత పంపిణీలోనూ ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలో ఉన్న గొల్ల, కురుమ సొసైటీ సభ్యుల్లో కొంతమందికి గతేడాది గొర్రెలను పంపిణీ చేయగా మిగిలిన సభ్యుల్లో కొంతమందికి కూడా ఇటీవలె పంపిణీ చేశారు. జిల్లాలో రెండో విడుతలో భాగంగా 21 వేల మందికి గొర్రెలను పంపిణీ చేయనున్నారు. తొలి విడుతలో 11,750 మందికి గొర్రెలను అందించారు.
త్వరలో రెండో విడుత ..
రెండో విడుత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గతేడాదే రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినా కొవిడ్ వైరస్, ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియను ప్రభుత్వం వాయిదా వేసింది. రెం డో విడుతలో భాగంగా జిల్లాలోని 21 వేల మంది గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేయనున్నారు. రూ.250 కోట్లతో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకురానున్నారు. అయితే తొలి విడుతలో 21 వేల మందికి గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉండగా కొవిడ్ వైరస్ ప్రభావం, ఎన్నికల దృష్ట్యా 11,377 మందికే గొర్రెలను పంపిణీ చేయగా…రెండు నెలల క్రి తం మిగిలిన వారికి గొర్రెలను పంపిణీ చేశారు.
తొలి విడుతలో గొర్రెల కొనుగోలు కోసం ప్రభు త్వం రూ.142 కోట్లను ఖర్చు చేసింది. కాగా రంగారెడ్డి జిల్లాలో 42 వేల మంది లబ్ధిదారులుండగా.. వారిని ఏ, బీ గ్రూపులుగా విభజిం చి లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. లాటరీ పద్ధతినే గతేడాది కొంతమందికి పంపిణీ చేయగా.. మిగిలిన వారికి ఈ ఏడాది గొర్రెలను పంపిణీ చేయనున్నారు. అయితే లబ్ధిదారుడికి ఒక్కో యూనిట్ కింద 20 గొర్రెలతోపాటు ఒక గొర్రె పొటేలును పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం రూ.1.25 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీని ఇవ్వనుండగా, మిగతా 25శాతం డబ్బును లబ్ధిదారులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం రూ. 93,750లను భరిస్తుండగా.. మిగతా రూ.31,250లను లబ్ధిదారులు చెల్లిస్తున్నారు.
రెండో విడుత పంపిణీకి సిద్ధం
రంగారెడ్డి జిల్లాలో రెండో విడుత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే రెండో విడుతలో పంపిణీ చేయాల్సిన లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయ డం పూర్తైంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తాం. రెండో విడుతలో రూ.250 కోట్లతో 21 వేల మందికి గొర్రెలను పంపిణీ చేయనున్నాం.
–డా.అంజిలప్ప జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి