పరిగి, జూలై 8: పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంపునకు సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఏటా ‘హరితహారం’ చేపడుతూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నది. ఈ కార్యక్రమానికి నిధుల కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రీన్బడ్జెట్కు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ప్రతి స్థానిక సంస్థ తన వార్షిక బడ్జెట్లో 10శాతం నిధులను గ్రీనరీ పెంపునకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వికారాబాద్ జిల్లాలో మొత్తం రూ.18.9కోట్లు కేటాయించారు. ఇందులో 566 గ్రామపంచాయతీల నుంచి రూ.13.97కోట్లు, నాలుగు మున్సిపాలిటీలు కలుపుకొని మొత్తం రూ.4.12కోట్లు గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించారు. మరోవైపు ఈసారి హరితహారం నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
గ్రామ పంచాయతీకో నర్సరీ చొప్పున ఏర్పాటు చేసి 85లక్షల మొక్కలు, అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 3,16,000 మొక్కలు పెంచారు. ప్రధాన రోడ్లలో ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా పరిధిలో మొత్తం 549 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ, మల్టీ లెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రాధాన్యాలు మారిపోయాయి. అన్ని గ్రామాలను పరిశుభ్రత, పచ్చదనానికి నిలయంగా మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకు అనుగుణంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు ప్రతి ఏడాది కోట్లాది మొక్కలను నాటడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు తమ వార్షిక బడ్జెట్లో పది శాతం
గ్రీన్ బడ్జెట్‌కు నిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిధులను కేవలం పచ్చదనం పెంపునకే ఖర్చు చేయనున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 566 గ్రామపంచాయతీలుండగా వాటికి సంబంధించి 2022-23 వార్షిక బడ్జెట్ రూ. 139.66 కోట్లుగా అధికారు లు నిర్ణయించగా ఇందులో గ్రీన్ బడ్జెట్‌గా రూ. 13.97 కోట్లను కేటాయించి పచ్చదనం పెంపు కార్యక్రమాలకు ఆ నిధులను ఖర్చు చేయనున్నారు.
మున్సిపాలిటీల్లో 3,16,000 మొక్కలు
గ్రీన్ బడ్జెట్ నిధులను కేవలం పచ్చదనం పెంపు కార్యక్రమాల కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో ప్రతి పంచాయతీకీ ఒక నర్సరీ చొప్పున ఏర్పాటు చేసి 85 లక్షల మొక్కలను పెంచనున్నారు. అలాగే నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 3,16,000 మొక్కలను పెంచుతున్నారు. వికారాబాద్‌లోని ఎనిమిది నర్సరీల్లో 1,40,000 మొక్కలు, పరిగిలోని ఐదు నర్సరీల్లో 40,000 మొక్కలు, తాండూరులోని రెండు నర్సరీల్లో 92,000 మొ క్కలు, కొడంగల్‌లోని రెండు నర్సరీల్లో 44,000 మొక్కలను పెంచుతున్నారు. ఈ ఏడాది వికారాబాద్‌లోని ఆరు ప్రధాన రోడ్లలో ఎవెన్యూ ప్లాంటేషన్ కింద 25 వేల మొక్కలను నాటనున్నారు. ఇందుకోసం 8 నుంచి 10 అడుగుల ఎత్తు గల మొక్కలను తీసుకురానున్నారు.
పరిగిలోని నాలుగు ప్రధాన, అంతర్గత రోడ్లు, కొడంగల్‌లోని నాలుగు రోడ్లలో నూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లాలోని 549 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపు లా ఎవెన్యూ, మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలతో గుంతలు తవ్వించడం, మొక్కలు నాటిన తర్వాత కంచెను ఏర్పాటు ఏర్పాటు చేయించనున్నారు. మున్సిపాలిటీల్లోని పార్కుల అభివృద్ధిలో భాగంగా మొక్కలను నాటనున్నారు. తద్వారా స్థానిక సంస్థలను భాగస్వాములను చేయడం ద్వారా నాటిన మొక్కలు అత్యధిక శాతం బతికే అవకాశం ఉంటుంది. వేసవిలో ఈ మొ క్కలకు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలకు సం బంధించిన ట్యాంకర్ల ద్వారా నీటిని అందించనున్నా రు. గ్రీన్ బడ్జెట్‌తో ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
566 గ్రామపంచాయతీల నుంచి రూ.13.97 కోట్లు
జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గ్రీన్ బడ్జెట్ కోసం రూ.13.97 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. జిల్లాలోని బంట్వారం మండలంలోని 11 గ్రామపంచాయతీల్లో గ్రీన్ బడ్జెట్ రూ.35 లక్షలు, బషీరాబాద్‌లోని 36 గ్రామపంచాయతీల్లో రూ.78లక్షలు, బొంరాస్‌పేటలోని 47 గ్రామపంచాయతీల్లో రూ.1.10 కోట్లు, ధారూరులోని 32 గ్రామపంచాయతీల్లో రూ.75 లక్షలు, దోమలోని 36 గ్రామపంచాయతీల్లో రూ.79 లక్షలు, దౌల్తాబాద్‌లోని 33 గ్రామపంచాయతీల్లో రూ.90 లక్షలు, కొడంగల్‌లోని 26 గ్రామపంచాయతీల్లో రూ.69 లక్షలు, కోట్‌పల్లిలోని 18 గ్రామపంచాయతీల్లో రూ.67 లక్షలు, కులకచర్లలోని 44 గ్రామపంచాయతీల్లో రూ.1.06 కోట్లు, మర్పల్లిలోని 27 గ్రామపంచాయతీల్లో రూ.90 లక్షలు, మోమిన్‌పేటలోని 28 గ్రామపంచాయతీల్లో రూ.89 లక్షలు, నవాబుపేటలోని 32 గ్రామపంచాయతీల్లో రూ.86 లక్షలు, పరిగిలోని 37 గ్రామపంచాయతీల్లో రూ.62 లక్షలు, పెద్దేముల్‌లోని 37 గ్రామపంచాయతీల్లో రూ.62లక్షలు, పూడూరులోని 31 గ్రామపంచాయతీల్లో రూ.71 లక్షలు, తాండూరులోని 33 గ్రామపంచాయతీల్లో రూ.1.06 కోట్లు, వికారాబాద్‌లోని 21 గ్రామపంచాయతీల్లో రూ.47 లక్షలు, యాలాలలోని 37 గ్రామపంచాయతీల్లో రూ.76 లక్షల నిధులను ఈ ఏడాది గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయించారు.
నాలుగు మున్సిపాలిటీల్లోనూ..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గ్రీన్ బడ్జెట్‌గా రూ.4,12,50,000 నిధులను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఇం దులో తాండూరు మున్సిపాలిటీ నుంచి గ్రీన్ బడ్జెట్‌కు రూ.2.85 కోట్లు, పరిగి మున్సిపాలిటీలో రూ.66 లక్షలు, వికారాబాద్ మున్సిపాలిటీలో రూ. 26లక్షలు, కొడంగల్ మున్సిపాలిటీలో రూ.35.50 లక్షలు కేటాయించారు.