ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 8 : చెట్లతోనే మానవ మనుగడ.. మొక్కలు విరివిగా నాటితే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. అందుకే అడవుల శాతాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఏడు విడుతల్లో నాటిన ప్రతి మొక్క కల్ప వృక్షంలా సత్ఫలితానిస్తున్నది. అంతేకాకుండా అడవుల శాతాన్ని పెంచేందుకు ఏటా సీడ్బాల్స్ను వేయడంతో పాటు అధిక సంఖ్యలో మొక్కలను నాటుతున్నారు. ఎనిమిదో విడుత హరితహారాన్ని సక్సెస్ చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం డివిజన్లోని అటవీ ప్రాంతాల హద్దుల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. అడవుల్లోని ఖాళీ స్థలాల్లో 20 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఇబ్రహీంప డివిజన్లో ఎనిమిదో విడుత హరితహారం కొనసాగుతున్నది. అటవీశాఖ ఆధ్వర్యంలో డివిజన్లోని అన్ని గ్రామాల్లోని అటవీప్రాంతాల హద్దుల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే డివిజన్లో దాదాపు 90 శాతం మొక్కలు నాటినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది అడవుల కట్టల వెంబడి అధిక శాతం మొక్కలు నాటుతామని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే అటవీప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో సుమారు 20 లక్షల మొక్కలు నాటేందుకు గుంతలను తీయిస్తున్నారు. అడవులను శాతం పెంచాలన్నదే లక్ష్యంగా కచ్చకాయ, చీమచింత, వెదురు, సీతాఫలం, కానుగ తదితర మొక్కలను నాటిస్తున్నట్లు సంబంధిత అధికారులు వివరిస్తున్నారు.
కందకాల కట్టలపై..
ప్రభుత్వం ఆదేశాల మేరకు అటవీ ప్రాంతాల్లోని కందకాల కట్టలపై మొక్కలు నాటే కార్యక్రమం ఇబ్రహీంపట్నం రేంజ్ పరిధిలో పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో అటవీప్రాంతం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో 2 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. అడవుల్లో మరిన్ని మొక్కలు నాటేందుకు గుంతలు తీయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హరితహారం విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.