ఇబ్రహీంపట్నం, జూలై 8 : ఇబ్రహీంపట్నం పట్ణణ వాసుల కోసం ప్రభుత్వం రూ.35 లక్షలతో వాకింగ్ పార్క్‌ను అత్యాధునిక హంగులతో నిర్మించింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు చకచకా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు వాకింగ్ చేసేందుకు సరైన ప్రాంతంలేక ఇబ్బందులకు గురైన సీనియర్ సిటిజన్స్, మహిళలు, యువత వాకింగ్ పార్క్ నిర్మాణం పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సౌకర్యవంతంగా..
ఇబ్రహీంపట్నం చిన్నచెరువులో వాకర్పార్కును సౌకర్యవంతంగా నిర్మించారు. వాకింగ్ చేసేందుకు వెడల్పు ట్రాక్ నిర్మాణంతో పాటు పార్క్ మధ్యలో వాటర్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. మధ్యలో పచ్చని గడ్డిని ఏర్పాటు చేయడంతో పాటు వాకర్స్ నడిచే కట్టకు ఇరువైపులా పూలచెట్లను నాటారు. సాగర్హ్రదారి పక్కన అత్యంత సుందరంగా పార్క్‌ను తీర్చిదిద్దడంతో చూపరులు మంత్రముగ్ధులవుతున్నారు.
రూ.35 లక్షలతో నిర్మాణం..
ఇబ్రహీంపట్నం చిన్నచెరువులో రూ.35లక్షలతో వాకర్పార్కును నిర్మించారు. హెచ్ఎండీఏ నుంచి ఎమ్మెల్యే చొరవతో రూ.30లక్షలు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నుంచి రూ.5లక్షలను కేటాయించారు. పార్క్‌ను మరింత తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు..
పార్క్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు. ఇప్పటికే సాయంత్రం వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ వచ్చి సేదతీరుతున్నారు. త్వరలో ఎమ్మెల్యే పార్క్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
– ఆకుల యాదగిరి, మున్సిపల్ వైస్ చైర్మన్
పార్క్‌ను సుందరంగా నిర్మించారు..
వాకర్పార్క్ను అద్భుతంగా నిర్మించారు. సాగర్ప్రధాన రహదారి పక్కన సుందరంగా ఉన్న పార్క్‌ను చూసేందుకు వాహనదారులు సైతం ఆగి సేదతీరుతున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డికి పట్టణ ప్రజలు రుణపడి ఉంటారు.
– జెర్కోని రాజు, యువజన నాయకుడు