షాద్‌నగర్‌టౌన్, జూలై 8 : గతంలో పేదింట్లో ఆడబిడ్డ పుట్టిందంటే చాలు పుట్టిన నాటి నుంచి పెంచి పెద్ద చేసి పెండ్లి చేసే వరకు భారంగా భావించేవారు. ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇదంతా ఒకప్పటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పేదింట్లో కల్యాణకాంతులను నింపేలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపడుచులకు కొండంత అండగా నిలిచాయి. ఏ ఒక ఆడబిడ్డ పెండ్లి తలిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆడబిడ్డ పెండ్లీలకు రూ.లక్షా116లను అందజేస్తున్నది. దీంతో పేదింట్లో ఆడబిడ్డల పెండ్లిలు ఎంతో సంతోషంగా జరుగుతున్నాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన లబ్ధిదారుల సంఖ్య
పేదింట్లో కల్యాణకాంతులను నింపేలా తెలంగాణ సర్కార్ 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది ఆడబిడ్డల తల్లిదండ్రులు ఈ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఆడబిడ్డ పెండ్లిలకు కుటుంబ పెద్దగా తెలంగాణ సర్కార్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ. లక్షా,116లను ఆడపడుచుల తల్లిదండ్రులకు అందజేస్తూ ఆసరాగా నిలుస్తుంది. ఇటివలే పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఆర్థికసాయం సంతోషకరం..
పేదింటి ఆడబిడ్డల పెండ్లీలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థికసాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. ఆడబిడ్డ పెండ్లిలు చేసిన మాలాంటి వారికి కల్యాణలక్ష్మి పథకం ఎంతో ఆసరాగా నిలిచింది. కల్యాణలక్ష్మి పథకం చాలా బాగుంది.
–రాజ్యలక్ష్మి, లబ్ధిదారురాలు తిమ్మాజిపల్లి ఫరూఖ్‌నగర్ మండలం షాద్‌నగర్