రంగారెడ్డి, జులై 6, (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగడంతోపాటు సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎంటర్ప్రైజెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతేడాది ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి గ్రామ సంఘంలో వ్యాపారం చేసేందుకు ఆసక్తి కలిగిన ముగ్గురు సభ్యుల చొప్పున ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులను బట్టి వ్యాపారాలను ఎంపిక చేసుకునేలా సెర్ప్ అధికారులు ఎస్‌హెచ్‌జీ మహిళలకు అవగాహన కల్పించారు.
వ్యాపారాల్లో నష్టపోకుండా ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేక నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చారు. ఒక గ్రామంలోని ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఒకే వ్యాపారం చేయకుండా ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారం చేసేలా అధికారులు అవగాహన కల్పించడంతో ఆయా వ్యాపారాల్లో సక్సెస్ అవుతున్నారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు వ్యాపారాలు చేసేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీతోపాటు స్త్రీనిధి ద్వారా రుణాలను మంజూరు చేస్తూ వస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 780 గ్రామసంఘాలుండగా 19,157 స్వయం సహాయక సంఘాలు, వీటిలో 2,17,417 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5827 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు వ్యాపార రంగంలో అడుగుపెట్టేందుకుజిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఏడాది టార్గెట్ 5827 మంది సభ్యులు
ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం 5827 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను ఈ ఏడాది స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ కింద లక్ష్యంగా నిర్ణయించిన రూ.700 కోట్ల రుణాల్లో రూ.350 కోట్ల రుణాలను ఎంటర్ప్రైజెస్ కార్యక్రమానికి రుణాలను మంజూరు చేసేందుకు నిర్ణయించారు. గతేడాది ఒక్కో సంఘానికి సగటున ముగ్గురు సభ్యులను ఎంపిక చేయగా, ఈ ఏడాది ఒక్కో సంఘానికి సగటున ఆసక్తి గలిగిన ఎనిమిది మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు. స్థానిక అవసరాలను బట్టి 163 రకాల వ్యాపారాలను చేసేందుకు వెసులుబాటు కల్పించారు. కేవలం స్థానిక అవసరాలనే దృష్టిలో పెట్టుకోకుండా ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఏర్పాటు చేసే వ్యాపారంలో నిలదొక్కుకోవడంతోపాటు ఆదాయం వచ్చేలా డీఆర్డీఏ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
గతేడాది జిల్లావ్యాప్తంగా 2979 మంది స్వయం సహాయక సభ్యులు 56 రకాల వ్యాపారాలను ఎంపిక చేసుకొని నిర్వహిస్తున్నారు. ఉత్పత్తి, వ్యాపార, సేవా రంగాలకు సంబంధించిన వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఎంటర్‌ప్రైజెస్‌లో భాగంగా ఎరువులు, విత్తనాల దుకాణం, కూరగాయల సేకరణ-మార్కెటింగ్, కిరాణ దుకాణం, బేకరీ, బట్టల దుకాణం, ఎంబ్రాయిడరీ షాప్, చేపల విక్రయ దుకాణం, ఎలక్ట్రికల్ దుకాణం, హార్డ్‌వేర్, ఇంటర్నెట్, బ్యూటీ పార్లర్, హోటల్, టిఫిన్ సెంటర్, మెడికల్ షాప్, సూపర్ మార్కెట్, మొబైల్ షాప్ తదితర వ్యాపారాలను ఎంపిక చేసుకుంటున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 780 గ్రామ సంఘాలకు సంబంధించిన 5827 మంది సభ్యులను వ్యాపారులుగా మార్చేందుకు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 1257 మంది సభ్యులకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయింది. మరో 4570 మంది సభ్యులకు కూడా సెప్టెంబర్‌లోగా ఆయా వ్యాపారాలను బట్టి రుణాలను మంజూరు చేసి వ్యాపారాలను ప్రారంభించేందుకు డీఆర్డీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధిస్తున్న దృష్ట్యా జిల్లాలో ప్రధానంగా జ్యూట్ బ్యాగ్‌ల తయారీపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది.
ఇప్పటికే నందిగామ, యాచారం మండలాల్లో ఎస్‌హెచ్‌జీ సభ్యులు జ్యూట్ బ్యాగుల తయారీ వ్యాపారం చేస్తుండగా, ఈ ఏడాది మరింత మంది సభ్యులు చేసేలా సెర్ప్ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. గతంలో మాదిరిగా జ్యూట్ బ్యాగుల తయారీతోపాటు మార్కెటింగ్ కూడా ఎస్‌హెచ్‌జీ సభ్యులే చూసుకున్నారు. ఈ ఏడాది జ్యూట్ బ్యాగుల తయారీ అవసరం పెరిగిన దృష్ట్యా వీలైనంత ఎక్కువ మంది జ్యూట్ బ్యాగుల తయారీని ఎంచుకునేందుకుగాను పలు ఆన్లైన్ సంస్థలతో మార్కెటింగ్‌కుగాను ఒప్పందం కుదుర్చుకునేందుకు నిర్ణయించారు. జ్యూట్ బ్యాగుల మార్కెటింగ్‌కుగాను అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు నిర్ణయించారు. గతేడాది వ్యాపారాలు ప్రారంభించిన ప్రతిఒక్కరూ రాణిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక సంఘం సభ్యురాలు రోజుకు రూ.5 వేల వరకు కూడా సంపాదిస్తుండడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా గతేడాది వివిధ వ్యాపారాలను ప్రారంభించిన 2979 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు చేస్తున్న వ్యాపారాలతో ఆయా వ్యాపారాల విక్రయ విలువ దాదాపు రూ.32.92 కోట్లకు చేరింది.