కులకచర్ల, జూలై 5 : రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ప్రభుత్వం పంచాయతీలకు మార్గదర్శకాలను రూపొందించింది. విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడంతో అధికారులు ఆ దిశగా కృషి చేస్తున్నారు. కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో 56 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని వాటిని పరిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు తెలియజేయడంతో ఆయా గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి గ్రామానికి వెళ్లే లింక్‌రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ముందుగానే ఉపాధిహామీ పథకం ద్వారా గుంతలు తీయించిన అధికారులు ప్రస్తుతం గ్రామాల్లో వర్షం కురియడంతో తవ్విన గుంతల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కులకచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సంవత్సరం నాటిన మొక్కలతో పాటు నాలుగు లైన్ల మొక్కలు రోడ్డుకు ఇరువైపులా నాటేందుకు గ్రామ పంచాయతీలు కృషి చేస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం వలన గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరిస్తున్నది. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటివాటిని పరిరక్షించేందుకు అధికారులు, గ్రామ పంచాయతీలకు తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేయడంతో ఆయా పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కృషిచేస్తున్నారు. దీంతో రోడ్లు హరితహారానికి మార్గాలుగా మారుతున్నాయి.
ఆహ్లాదకరంగా మొక్కలు..
కామునిపల్లి గ్రామం నుంచి కులకచర్ల గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో ప్రయాణికులకు, గ్రామాల ప్రజలకు కనువిందుకలిగిస్తున్నాయి. పరిగి-మహబూబ్‌నగర్ రోడ్డుకు ఇరువైపులా భారీగా నాలుగు లేన్లు మొక్కలు నాటుతున్నారు. దీంతో ఇప్పటికే చాలా వరకు మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం మరింత పకడ్బంధిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కులకచర్ల గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కృషిచేస్తున్నారు. దీంతో రోడ్లు హరిత రహదారులుగా దర్శనమిస్తున్నాయి. మంగళవారం కులకచర్ల గ్రామ పరిధిలోని రోడ్డుకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను గ్రామ సర్పంచ్ సౌమ్యావెంకట్‌రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నింటికీ ఇరువైపులా మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తామన్నారు. హరితహారం కార్యక్రమానికి తమవంతు కృషిచేస్తామని, గ్రామ పరిసరాల ప్రాంతాల్లో అవసరమున్న చోట హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
విరివిగా మొక్కలు నాటిస్తున్నాం
కులకచర్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామంలో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం. గత సంవత్సరం నాటిన మొక్కలకు పాతులు తీయడంతో పాటు కొత్త మొక్కలు నాటి వాటికి నీటిని అందిస్తున్నాం. హరిత రహదారులగా చేసేందుకు కృషి చేస్తున్నాం. దీంతో పాటు పల్లె ప్రకృతి వనంలో మొక్కలు పెంచుతున్నాం.
– శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కులకచర్ల