అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండో రోజు వేడుకలు
పలు పథకాల మహిళా లబ్ధిదారులతో సెల్ఫీ దిగిన ప్రజాప్రతినిధులు, నాయకులు
మహిళా ఉద్యోగులు, కార్మికులకు సన్మానం
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు రాఖీలు కట్టిన మహిళామణులు
ముగ్గులు, వ్యాస రచన, చిత్రలేఖనం, పాటల పోటీలు.. బహుమతులు అందజేత
పరిగి, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా ప్రజలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చైతన్యవంతులయ్యారని తెలిపారు. స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లతోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ మహిళా బంధుగా నిలిచారని కొనియాడారు. మహిళల తాగునీటి కష్టాలు దూరం చేసేందుకు మిషన్ భగీరథ అమలు చేశారని, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మహిళల పేరిట అందజేస్తున్నారన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు.
పరిగి, మార్చి 7 : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని పరిగి ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ పరిగి పట్టణ అధ్యక్షుడు సంతోష్ పేర్కొన్నారు. పరిగి మండల పరిధిలోని గ్రామాలు, పరిగి పట్టణంలోని వార్డుల్లో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలిసి వారు సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులను కలిశారు.
వికారాబాద్, మార్చి 7 : మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌కు లబ్ధిదారులు రుణపడి ఉంటారని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తెలిపారు. వికారాబాద్‌లోని 25వ వార్డులో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సెల్ఫీ కార్యక్రమం చేపట్టారు.
కులకచర్ల, మార్చి 7 : సీఎం కేసీఆర్ మహిళలకు ఆపద్బంధువుగా నిలుస్తున్నారని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని చౌడాపూర్, మక్తవెంకటాపూర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మహిళా పంచాయతీ కార్మికులను సన్మానించారు. మహిళలు సీఎం చిత్రపటానికి రాఖీలు కట్టారు. డ్వాక్రా మహిళలు, హెల్త్ వర్కర్లు, పారిశుధ్య కార్మికులను ఎంపీపీ, జడ్పీటీసీ సన్మానించారు. చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామపంచాయతీలో సర్పంచ్ ప్రమీల అధ్యక్షతన గ్రామపంచాయతీ మహిళా సిబ్బందిని, కార్మికులతోపాటు ఎంపీపీ సత్యహరిశ్చంద్రను సన్మానించారు.
బొంరాస్‌పేట, మార్చి 7 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎంపీడీవో శ్రీదేవి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు ముగ్గులు వేశారు. పాటలు పాడారు. ఎంపీడీవో శ్రీదేవిని అంగన్వాడీ టీచర్లు సన్మానించారు.
బంట్వారం, మార్చి 7 : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని టీఆర్ఎస్ పార్టీ బంట్వారం మండల అధ్యక్షుడు రాములు యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మహిళలను సన్మానించగా.. తోటి మహిళలు గాజులు తొడిగారు.
కోట్‌పల్లి, మార్చి 7 : ప్రభుత్వం మహిళలకు మేలు చేసేలా ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నదని.. దీంతో మహిళలు సీఎం కేసీఆర్ పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు అన్నారు. సోమవారం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు తదితర విభాగాల్లో పనిచేస్తున్న మహిళలను ఆయన సన్మానించారు.
బషీరాబాద్, మార్చి 7 : మహిళల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నదని ఎంపీపీ కరుణ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన వేడుకల్లో పాల్గొని తోటి మహిళలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. మర్పల్లి గ్రామంలో ఉప సర్పంచ్ వసుధ ఆధ్వర్యంలో మహిళా వార్డు సభ్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయురాలిని సన్మానించారు.
యాలాల మార్చి 7 : ఆడపడుచుల ఆత్మ బంధువు, సంక్షేమ సారథి సీఎం కేసీఆర్‌కు ఊరూరా జేజేలు పలుకుతున్నారని సర్పంచులు రత్నమ్మ, కృష్ణయ్య గౌడ్ అన్నారు. సోమవారం యాలాల మండలం అన్నాసాగర్, ముద్దాయిపేటలో వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న మహిళలను ఎంపీడీవో పుష్పలీల సన్మానించారు. మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణని టీఆర్ఎస్ తాండూరు మహిళా అధ్యక్షురాలు సౌజన్య అన్నారు. తాండూరులోని 33వ వార్డులో పలు రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను సన్మానించారు.
మోమిన్‌పేట, మార్చి 7 : మహిళల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయం అవరణలో మహిళా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేసారం గ్రామంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ఎంపీడీవో శైలజారెడ్డి బహుమతులు అందించారు.
మర్పల్లి, మార్చి 7 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సర్పంచ్ జయ అన్నారు. సోమవారం మండలంలోని బూచన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆశ వర్కర్లు, ఏఎంన్ఎం, అంగన్వాడీ టీచర్, పంచాయతీ కార్మికులను సన్మానించారు.
దోమ, మార్చి 7 : మండల కేంద్రంలోని కల్యాణలక్ష్మి, రైతు బీమాతో లబ్ధి పొంది.. ప్రభుత్వం ద్వారా అందిన ఆర్థిక చేయూతతో జీవనం కొనసాగిస్తున్న మహిళలను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఓ కుటుంబానికి కేసీఆర్ కిట్‌ను అందజేశారు.
కొడంగల్, మార్చి 7 : నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం కుప్పగిరి గ్రామ మహిళలను మిషన్ భగీరథ డీఈ శశాంక్మిశ్రా సన్మానించారు. కొడంగల్ వ్యవసాయ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు అన్నింటా రాణించేలా కృషి చేయాలని తెలిపారు.
పూడూరు, మార్చి 7 : గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆర్థికంగా ఎదుగాలని ఎంపీపీ మల్లేశం పేర్కొన్నారు. మండల పరిధిలోని అంగడిచిట్టంపల్లి అంగవాడీ కేంద్రం సర్పంచ్ జయమ్మదాస్, పూడూరు కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మంగళవారం పూడూరులో సీఎం రిలీఫ్ ఫండ్స్ నిధులు అర్హులకు అందజేయనున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయం వద్దకు రావాలన్నారు.
పెద్దేముల్, మార్చి 7 : మగువ లేనిది మానవ మనుగడ లేదని పెద్దేముల్ సర్పంచ్ విజయమ్మ అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మహిళ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం, పాటల పోటీలను నిర్వహించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.