తుర్కయాంజాల్, జూలై 3 : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లతో శివారు ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం అన్ని రకాల మౌలిక వసతులతో ఈ లేఅవుట్ల ఏర్పాటు జరుగుతున్నది. తద్వారా ఆయా ప్రాంతాల్లో సైతం భూములు ధరలు పెరుగుతున్నాయి. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో తొర్రూర్, తుర్కయాంజాల్ సాగర్ జాతీయ రహదారిని ఆనుకొని హెచ్ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నది. విశాలమైన రోడ్లు, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుండడంతో ఇప్పటికే ఆన్లైన్ వేలంలో ఈ ప్లాట్లు అత్యధిక ధరలకు అమ్ముడుపోయాయి. తొర్రూర్‌లో మొదటి విడుతలో కొన్ని ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించగా తిరిగి రెండో దశలో 148 ప్లాట్ల ఆన్లైన్ వేలం కొనసాగుతున్నది. తుర్కయాంజాల్‌లో సైతం అత్యధికంగా 65వేలకు పైగా గజం ధర పలకింది.
లేఅవుట్లపై పెరుగుతున్న నమ్మకం..
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా లేఅవుట్లను చేసి మార్కెట్ ధరకు మించి ప్రజలకు ప్లాట్లను విక్రయిస్తున్నారు. మార్కెట్ ధర కంటే అత్యధిక ధరను చెల్లించినా అన్ని సౌకర్యాలు లేకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వానికి చెందిన క్లియర్ టైటిల్, మాస్టర్ ప్లాన్‌ను అనుగుణంగా విశాలమైన రోడ్లు, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా హెచ్ఎండీఏ ప్లాట్లు విక్రయిసుండడంతో ప్రజలకు హెచ్ఎండీఏ లే అవుట్లపై నమ్మకం పెరుగుతున్నది. దీంతో అత్యధికంగా ప్రజలు హెచ్ఎండీఏ లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. రిజిస్ట్రేషన్ మొదలుకొని ఇల్లు నిర్మించుకునేందుకు వీలుగా అన్ని అనుమతులతో హెచ్ఎండీఏ లే అవుట్లు అభివృద్ధి చేస్తుండడంతో ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
భూముల ధరలకు రెక్కలు..
తుర్కయాంజాల్ ప్రాంతంలో హెచ్ఎండీఏ అన్ని హంగులతో లే అవుట్లను అభివృద్ధి చేయడం ఎంతో సంతోషకరం. చుట్టు పక్కన ప్రాంతాల్లో భూములకు మంచి ధరలు పలుకుతున్నాయి. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లు అన్ని రకాల సౌకర్యాలు ఉండడంతో ప్రజలు అందులో ప్లాట్లను కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ లే అవుట్లకు భారీ డిమాండ్ ఉంటుంది.
– కొంతం యాదిరెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి