పెద్దేముల్, జూలై 2: మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించకపోతే మధ్యా హ్న భోజన నిర్వాహకులపై చర్యలు తప్పవని వికారాబాద్ డీఈవో రేణుకాదేవి హెచ్చరించారు. శనివారం ఆమె మండలంలోని గొట్లపల్లి మోడల్ స్కూ ల్, పెద్దేముల్ బాలుర ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గొట్లపల్లి మోడల్ స్కూ ల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి ఏజెన్సీ సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందించారు. విద్యార్థుల కు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, భోజనం నాణ్యతగా ఉండాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు.
అదే విధంగా పదోతరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని.. ఇందుకు ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో ఉన్న స్థలంలో తెలంగాణకు హరితహారంలో భాగంగా ఎక్కువ సంఖ్యలో వివిధ రకాల మొక్కలను నాటాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంఈవో వెంకటయ్య, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రి, ప్రధానోపాధ్యాయుడు శాంతప్ప, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు