మోమిన్‌పేట, జూన్ 25 : కంపోస్ట్ షెడ్డుల్లో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు అందించాలని ఎంపీపీ వసంత వెంకట్ అన్నారు. శనివారం మండల ప్రజాపరిసత్ కార్యాలయంలో ఎంపీపీ వసంత వెంకట్ అధ్యక్షతన ఎంపీడీవో శైలజారెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా పరిసత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మండల అధికారులు నివేదికను చదివి వినిపించారు. ఆదే విధంగా ఆయా గ్రామల సర్పంచులు కరెంట్, విద్యుత్ సమస్యలపై సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, మండల అధికారు సమన్వయంతో పని చేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ ఓల్టేజ్ తగ్గకుండా సరఫరా చేయాలని, థర్డ్ వైర్ ఏర్పాటు చేసి ఆన్ఆఫ్ స్విచ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు నెలకు విద్యుత్‌ను 100 యూనిట్ల లోపు వినియోగించుకునేలా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. మండలంలో లైసెన్స్ లేని కల్లు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో మండల పరిధిలోని ఆయా పంచాయతీల సర్పంచ్‌లు పాల్గొన్నారు.