కొడంగల్, జూన్ 22 : పట్టణంలో ప్రతి బుధవారం సంత కొనసాగుతున్నది. సంతకు స్థానిక ప్రాంత వ్యాపారస్తులే కాకుండా తాండూర్, పరిగి, షాద్‌నగర్ వంటి దూర ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి వ్యాపారస్తులు వచ్చి అమ్మకాలు జరుపుతుంటారు. సంతలో లభించే ఆకు, కూరగాయలను స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి కొంటుంటారు. సంతలో తక్కువ ధరకే అన్ని రకాల ఆకు, కూరగాయలు లభించడంతో పాటు రోజురోజుకూ కొనుగోలుదారుల సంఖ్య పెరిగిపోతున్నది. ఆకు కూరగాయలే కాకుండా వ్యవసాయపరంగా అవరమైయ్యే వస్తువులు లభిస్తాయి. దీంతో స్థానికులకు చాలా వరకు ఉపయోగకరంగా మారింది.
ఏండ్లకాలంగా ఎండలోనే..
ఏండ్ల కాలంగా నిర్వహిస్తున్న సంతలో ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేక వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. తాగునీరు, మరుగుదొడ్లు, తదితర వసతులు అందుబాటులో లేకపోయేవి. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. వ్యాపారాలు చేసుకునేవారు. ఈ తిప్పలు ఎప్పుడు తప్పుతాయోనని వాపారులు, వినియోగదారులు ఎదురుచూస్తుండేవారు. గొడుగులు, గుడారాలు అమర్చుకొని నీడపట్టున వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చేది. వర్షాకాలంలో తీవ్ర వానలకు కురిస్తే తడవడమే కాకుండా సంత బజార్ మొత్తంగా బురదమయంగా మారి వ్యాపారస్తులకు కూర్చొనేందుకు, వినియోగదారులు నడిచే వీలు లేకుండా ఉండేది. బురదలో ఉన్న ఉరుకుపాటి స్థలంలో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవి.
షెడ్ నీడలో అమ్మకాలు..
ఎటువంటి సౌకర్యాలు లేని సంతలో మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా రూ.1కోటి నిధులను కేటాయించి అన్నింటా సౌకర్యాలతో కూడిన వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను నిర్మించారు. షెడ్స్ ఏర్పాటు చేసి వ్యాపారాలకు అనుగుణంగా స్థలాలను కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో మాదిరిగా సుందరమైన మార్కెట్ రూపుదిద్దుకున్నది. సంత బజార్ మొత్తం సీసీ రోడ్డు వేయడంతో పూర్తి శుభ్రంగా మారింది. దీంతో వ్యాపారాలు చేసుకునే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మార్కెట్‌ను ప్రారంభించారు. బుధవారం మొదటి సారిగా వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లో వ్యాపారస్తులు అమ్మకాలు జరుపుకొంటున్నారు. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పడటంతో వ్యాపారస్తులు, వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తిప్పలు తప్పాయి..
గతంలో సంతబజార్‌లో ఏం సౌకర్యాలు ఉండేవికావు. స్థలాల కేటాయింపు లేక పోవడం వల్ల ఎవరు ముందు వస్తే వారిదే స్థలం ఉండేది. దాంతో అధికంగా గొడవలు జరిగేవి. ఎండ, వాన కాలం గొడుగులు పట్టుకొని అవస్తలు పడేవాళ్లం. తప్పని పరిస్థితులు కాబట్టి బుదరలోనే కూర్చొని కూరగాయలు అమ్ముకునే వాళ్లం. మార్కెట్ ఎప్పుడు బాగుపడుతుందాని ఎదురు చూసేవాళ్లం. కానీ నేడు నీడపట్టున కూర్చొని వ్యాపారం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
– ప్రకాశ్, వ్యాపారి, కొడంగల్
విశాలమైన స్థలం..
కొత్త మార్కెట్ ప్రారంభం కావడం వల్ల వ్యాపారుల కష్టాలు తీరాయి. అప్పట్లో తప్పని పరిస్థితులు ఉండేవి. నేడు అన్నింటా సౌకర్యాలు ఏర్పడి వ్యాపారాలు చేసుకోవడం ఆనందంగా ఉంది. విశాలమైన స్థలం. చుట్టూ సీసీ రోడ్డు. షెడ్స్‌ను కట్టి.. చిన్నపాటి దుకాణాలుగా ఏర్పాటు చేయడం. ఎవరి స్థలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్ముకొంటున్నాం.
– ఆంజనేయులు, వ్యాపారి, కొడంగల్