పెద్దఅంబర్‌పేట, జూన్ 22 : రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తున్నదని హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో రామోజీ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీపీ మహేశ్ భగవత్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రతి విభాగాన్ని పరిశీలించారు. నిర్మాణ తీరును చూసి సంతోషం వ్యక్తంచేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ పెట్రోలింగ్ కోసం ప్రభుత్వం రూ.700 కోట్లు కేటాయించిందని తెలిపారు. 100కు డయల్ చేస్తే ఐదారు నిమిషాల్లో పోలీసులు వచ్చి సాయం అందిస్తున్నారని చెప్పారు. దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో 68 శాతం సీసీ కెమెరాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు. మహిళల భద్రత కోసం, వారికి సాయం చేసేందుకు షీ టీమ్‌లు, భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. లాండ్ అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా కొత్త వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ బుర్ర రేఖ, జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ చెరుకు కిరణ్‌గౌడ్, ఎంపీటీసీ సౌమ్య, బాటసింగారం సహకార బ్యాంకు కమిటీ చైర్మన్ విఠల్‌రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ స్వామి, సుష్మా ఎస్టేట్స్ సీఎండీ రుద్రశంకర్ పాల్గొన్నారు.