రంగారెడ్డి, జూన్ 20, (నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నది. ఈసారి కూడా అందజేసేందుకు లక్ష్యం ఖరారు కాగా.. అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం కోటీ 16 లక్షల చేప పిల్లలను అందించేందుకు జిల్లా మత్స్యశాఖ నిర్ణయిచింది. మరో పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తికానుండగా.. చెరువుల్లోకి నీరు వచ్చిన వెంటనే చేప పిల్లలను వదిలేందుకు సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సర్కార్.. వారు చేపలు విక్రయించేందుకుగాను ఇప్పటికే 70 శాతం సబ్సిడీతో వాహనాలను కూడా అందజేసింది. కాగా, జిల్లావ్యాప్తంగా 103 మత్స్యకారుల సొసైటీలుండగా 6616 మంది సభ్యులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెలను పంపిణీ చేసిన ప్రభుత్వం.. మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి భరోసాను కల్పించింది. చేపల పెంపకాన్ని వదిలి ఏదో ఒక కూలీ పని చేస్తూ బతుకునీడుస్తున్న మత్స్యకారుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ తిరిగి వెలుగులు నింపారు. ఇందులోభాగంగా ఐదేండ్లుగా మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులు సక్సెస్ కావడం, చెరువుల్లో నీరు నిండుతుండడంతో చేపల పెంపకానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు దఫాల్లో చేపల పెంపకం పూర్తి కావడంతో సంబంధిత చేపలను విక్రయించిన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. మత్స్యకారుల జీవితాల్లో నూతనోత్సాహం నింపిన సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గతేడాది జిల్లాలో కోటి చేప పిల్లలను చెరువుల్లో వదలగా, ఈ ఏడాది గతేడాదికి మించి చేపపిల్లలను వదలేందుకు జిల్లా మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 1.16 కోట్ల చేప పిల్లలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జిల్లా మత్స్యశాఖ అధికారులు. ఈ ఏడాది చిన్న, పెద్ద పరిమాణంగల చేప పిల్లలను జిల్లాలోని చెరువుల్లో పెంచేందుకు నిర్ణయించారు. పెద్ద చేప పిల్లలు (82-100 మి.మీ), చిన్న చేపపిల్లలు(35-40 మి.మీ) రెండు రకాల చేపలను పెంచనున్నారు. అయితే చేప పిల్లల విత్తనాలను ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్ల ద్వారా జిల్లాకు చేప పిల్లల విత్తనాలను సమకూర్చనున్నారు. ఈ నెల మొదటి వారంలో ఆన్లైన్లో విత్తనాల కోసం టెండర్లను ఆహ్వానించగా.. పలువురు టెండర్లను దక్కించుకునేందుకు దరఖాస్తుల చేసుకున్నారు. మరో వారం, పది రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి చేపపిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
జిల్లాలోని 576 చెరువుల్లో.. 119 చెరువులు మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో ఉండగా, మిగతా 417 చెరువులు గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.చెరువుల్లోకి నీరు వచ్చిన వెంటనే చేప పిల్లలను వదలనున్నారు. చేపకు, చెరువుకు ఉన్న అనుబంధాన్ని తిరిగి నెలకొల్పే సదుద్దేశంతో చెరువుల్లో చేపలను పెంచేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వందశాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేపలను మత్స్యకారుల సొసైటీల ఆధ్వర్యంలో పెంచుతున్నారు. గతంలో కొన్ని చెరువుల్లో నీరు లేకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిరుత్సాహంతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది.
రువుల్లో నీరు లేకపోవడంతో కొందరు మత్స్యకారులు వలసలు పోగా, మరికొందరు ఇతర పనులు చేస్తుండేవారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు పూర్తైన చెరువుల్లో చేప పిల్లలను పెంచే ప్రక్రియ జరుగుతున్నది. కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల విస్తీర్ణాన్ని బట్టి చేపలను పెంచుతున్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేపల పెంపకం జరిగేందుకు గ్రామ కార్యదర్శి తదితరులతో కూడిన గ్రామస్థాయిలో కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది.
జిల్లాలో 103 మత్స్యకారుల సొసైటీలుండగా, వీటిలో 12 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలున్నాయి. సంబంధిత మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 6616 మంది సభ్యులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందజేయడంతోపాటు చేపలను విక్రయించడంలో మత్స్యకారులు నష్టపోకుండా కూడా చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా దళారుల ప్రమేయం ఎక్కువగా ఉండి నిజమైన మత్స్యకారులు నష్టపోవాల్సిన పరిస్థితి లేకుండా ప్రణాళికను రూపొందించింది. జిల్లాలో పెంచిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా హైదరాబాద్‌తో పాటు స్థానికంగా విక్రయిస్తున్నారు. చేపలను విక్రయించేందుకు 70 శాతం సబ్సిడీతో వాహనాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే మత్స్యకారులకు అందజేసింది.
టెండర్ల దరఖాస్తు ప్రక్రియ పూర్తి : సుకీర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారి
ఈ ఏడాది చేపల పెంపకం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేశాం. చేప పిల్లల కొనుగోలుకు టెండర్ల దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా, త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తాం. చెరువులు నిండిన వెంటనే చేప పిల్లలను వదలే ప్రక్రియ ప్రారంభిస్తాం. జిల్లాలో ఈ ఏడాది కోటీ16లక్షల చేపపిల్లలను 576 చెరువుల్లో పెంచేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశాం.