ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 20: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో నియోజకవర్గంలోని రైతులు దుక్కులు దున్ని విత్తనాలను విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే, వరినాట్లు వేసేందుకు నారుమడులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో పనులు ఊపందుకున్నాయి. వరిపంటలో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక లాభాలను సాధించొచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జూలై మొదటి వా రంలో వరినార్లు వేసేందుకు రైతులు పొలాలను సి ద్ధం చేసుకుంటున్నారు. మేలు రకం విత్తనాలను ఎం చుకుని విత్తితే అధిక దిగుబడి వస్తుందని.. భూమిలో తేమ శాతం ఉంటేనే విత్తుకోవాలని, మొలక శాతం ఎక్కువగా ఉన్న విత్తనాలను కొనుగోలు చేయాలని వ్యవసాధికారులు సూచిస్తున్నారు.
ఎకరానికి 25 కిలోలు..
అదేవిధంగా ఎకరానికి 25 కిలోల మేలురకం విత్తనాలను ఎంచుకోవాలి. కిలో విత్తనాలకు కార్బండిజిమ్ 2.5గ్రాములతో విత్తనశుద్ధి చేయాలి. నారుపోసేందుకు ఎంచుకున్న విత్తనాల మొలకశాతాన్ని పరీక్షించాలి. పొలాన్ని దున్ని నారుమడి పోసేందుకు ముందుగా విత్తనాలను నీటితో 24గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని బయటికి తీసి బస్తా లో వేయాలి. కనీసం మూడు రోజుల తర్వాత మొలకొచ్చిన విత్తనాలను ముందుగా సిద్ధం చేసుకున్న నారుమడిలో చల్లాలి. ముందుగా నారుమడిలో భూస్వార పరీక్షల్లో తేలిన మేరకు జింక్, కాంప్లెక్స్ ఎరువులు వాడాల్సి ఉంటుంది. ఎకరం భూమికి సరిపడా నారు కావాలంటే ఐదు సెంట్ల భూమిలో నా రును పెంచితే సరిపోతుంది. 25 నుంచి 30 రోజుల నారును మాత్రమే నాటేందుకు ఎంచుకోవాలి.
తెలియని వ్యక్తుల వద్ద కొనొద్దు
పరిచయం లేనివారు, గతంలో ఎప్పుడూ విత్తనాలను అమ్మనివారి వద్ద విత్తనాల కొనుగోలు అంత మంచిది కాదు. కొందరు దళారులు అడ్డదారిన రైతులను సంప్రదించి బురిడీ కొట్టిస్తున్నారు. వారితో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గ్రామాలకు వచ్చి ఊరు, పేరు లేని కంపెనీల విత్తనాలను అంటగట్టే అవకాశం ఉంది. గుంటూరు, హైదరాబాద్ వెళ్లి
కొందరు రసీదు లేకుండా అనుమతి లేని విత్తనాలు కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాం టి కొనుగోళ్ల వల్ల సాగు సమయంలో అనుకోని నష్టాలు వస్తే ఎవరినీ జవాబు దారీ చేయలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఏవో, ఏఈవోఓ సలహాలతోపాటు స్థానిక డీలర్ల వద్ద రసీదులు తీసుకొని కొనుగోలు చేయడం అత్యుత్తమం.
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి..
మేలు రకం విత్తనాలను ఎంచుకోవాలి
ఖరీఫ్ సీజన్లో వరి పంటను సాగు చేసే రైతులు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి. నారు వేసే ముందు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలను తీసుకోవాలి. రైతులు ముందుగా మేలు రకం విత్తనాలను ఎంచుకోవాలి. ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులను ఆశ్రయించకుండా సర్కారు ఆధ్వర్యంలో అందజేస్తున్న విత్తనాలనే కొనుగోలు చేయాలి.
–వరప్రసాద్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం వ్యవసాయాధికారి