బడంగ్‌పేట, జూన్ 19: బడంగ్‌పేటలో నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనానికి ఇంద్రారెడ్డి స్మారక భవనంగా పేరు పెడితే బీజేపీ నాయకులకు కడుపు మంట ఎందుకని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పెద్దబావి ఆనంద్‌రెడ్డి, బీమిడి జంగారెడ్డి, శ్రీనివాస్‌రాజ్, కర్రె బల్వంత్, ప్రదీప్, శ్రీనివాస్ తదితరులు ప్రశ్నించారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయానికి ఏ పేరు పెట్టాలన్నది గ్రంథాలయ శాఖ ఒక తీర్మాణం చేసిందన్నారు. గతంలో గ్రంథాలయాల విస్తరణకు, పల్లెలకు, పట్టణాలకు గ్రంథాలయలను ఏర్పాటు చేయడానికి కృషి చేసిన వారి పేర్లను పరిగణంలోకి తీసుకొని ఇంద్రారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారని తెలిపారు. గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు ఎందుకు పెట్టారని.. ఎవరూ అడుగలేదు కాదా అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇంద్రారెడ్డి ఎనలేని సేవలు చేశారన్నారు. విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశారన్నారు. రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరవలేనిదన్నారు. విద్యాశాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. రంగారెడ్డి జిల్లా వాసిగా ఆయన సేవలను గుర్తించిన తర్వాతనే గ్రంథాలయ శాఖ ఇంద్రారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి పేరు ఎందుకు పెట్టకూడదో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. తెలంగాణ అమర వీరుల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీజేపీ నాయకులు ఆందోళనలు చేయడం అర్థం లేదన్నారు. ఇం ద్రారెడ్డి తెలంగాణ అమరవీరుడు కాదా అని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాన్ని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన అంశాలను పరిశీలించకుండనే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధికి సహకరించాలి తప్ప ఆటకం కలిగించొద్దని సూచించారు. ఏ పేరు పెట్టాలని బీజేపీ నాయకులను అడగాల్సిన అవసరం లేదన్నారు. జాతీయ నాయకుడు అయితేనే పేర్లు పెట్టాలని ఎక్కడ ఉందన్నారు. ప్రజా సేవలు, ఉద్యమాలు, మానవతావాదుల పేర్లు ఎందుకు పెట్టకూడదన్నారు.గతంలో ఈ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎం చేశారో చెప్పాలన్నారు. ఉనికి కోసం ఆందోళనలు చేయడం సరికాదన్నారు. మంచి పని చేయడం నేర్చుకోవాలన్నారు.