ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 19 : ప్రభుత్వం పెద్ద ఎత్తున సర్కారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత ఇంటినుంచే స్మార్ట్ ప్రిపరేషన్ ద్వారా పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పోటీపరీక్షలు రాసే అభ్యర్థుల్లో రోజురోజుకూ ఈ స్మార్ట్ప్రిపరేషన్కు ఎంతో ఆదరణ పెరిగిపోయింది. వేలరూపాయల ఖర్చు, రోజుల కొద్దీ సమయం వృథాలేకుండా స్మార్ట్‌ఫోన్ ఉంటే మనకు కావాల్సిన సబ్జెక్టులను నిమిషాల్లో తీసుకోవచ్చు. ఒకప్పుడు నోటిఫికేషన్ విడుదల అయిననాటి నుంచి ఫలితాలు వెలువడే వరకూ ఒక అభ్యర్థి ప్రతి సమాచారం కోసం ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. నోటిఫికేషన్ విడుదల అయితే ఎన్ని పోస్టులు, ఆఖరి గడువు, అర్హతలు, ఇతర సమాచారం కోసం పత్రికల్లో వెతికే పరిస్థితి కనిపించేది. కొన్ని ఉద్యోగాల సమాచారం కూడా క్షేత్రస్థాయికి వచ్చేవికావు.
దాని తర్వాత పరీక్షకు దరఖాస్తు చేసుకోవటానికి గంటలకొద్దీ సమయం అనంతరం చదివేందుకు కావాల్సిన పుస్తకాల సేకరణ, వేల రూపాయల ఖర్చులుండేవి. పరీక్ష అనంతరం ఫలితాల కోసం వెతుక్కునే పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నోటిఫికేషన్ విడుదలైన నిమిషాల్లోనే మనకున్న స్టడీయాప్స్ ద్వారా సమాచారం అందుతున్నది. అందుకు దరఖాస్తు కూడా నిమిషాల్లో పూర్తవుతున్నది. దరఖాస్తు అనంతరం పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలి? ముఖ్యమైన అంశాలు, టైమ్‌టేబుల్, తదితర సూచలన్నీ నిపుణులు ఈ యాప్స్ ద్వారా మనకు రోజు అందిస్తూ ఉన్నారు. వీటి ద్వారా పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం కోసం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు యువత పోటీ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా ఇంటినుంచే సన్నద్ధమవుతున్నది.
రకరకాల ఫీచర్లతో ఎడ్యుకేషన్ అప్లికేషన్లు..
పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో విషయపరిజ్ఞానం అవసరం. కరెంట్అఫైర్స్పై ఎంతో పట్టుండాలి. అప్పుడే సక్సెస్‌ను అందుకోగలరు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా పుస్తకాలు కొనుక్కొని చదుకోవటం కొన్నిసార్లు వీలుపడదు. కరెంట్అఫైర్స్ ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి. వీటి కోసం అందుబాటులో ఉన్న అప్లికేషన్లను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే రిక్రూట్మెంట్, ఎస్ఎస్సీ తదితర వాటిద్వారా నియమించే అన్ని ఉద్యోగాలకు నేడు అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో జీకేఇండియా, మనపీఎస్సీ, కౌటిల్యకెరీర్స్, బైజూస్, మ్రూనాల్, అన్అకాడమీ, బ్యాంకర్స్అడ్డా, ఎస్ఎస్సీ అడ్డా, గ్రేడ్అప్, టాప్‌ర్యాంకర్స్, ఐప్రూవ్స్టడీబడ్డీ, డైలీహంట్లాంటి అనేక అప్లికేషన్ల ద్వారా ఆయా పరీక్షల్లో రాణించాలనుకునే అభ్యర్థులకు ఎంతో మేలుచేకూరుతుంది. ఈ అప్లికేషన్ల ద్వారా టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, యూపీఎస్సీ తదితర పరీక్షల స్టడీమెటీరియల్స్ పొందవచ్చు. పోటీపరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టులూ ఇందులో అందుబాటులో ఉంటాయి. బుక్‌మార్క్, ఫాంట్సైజ్, కలర్, తదితర అన్ని రకాల ఫీచర్లతో ఇవి పనిచేస్తున్నాయి.
స్టడీసర్కిళ్ల కంటే ఆన్లైన్ తరగతులకే ప్రాధాన్యత..
డబ్బులుండి కొందరు…లేకున్నా అప్పులు చేసి మరికొందరు నగరంలోని ప్రైవేటే స్టడీ సర్కిళ్లలో చేరి లక్షల రూపాయలు ఖర్చు చేసుకునేవారు. కానీ మారుతున్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ఇంటి వద్ద ఉంటూనే పోటీపరీక్షలకు, ఇతర పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు టీవీ ముందు కూర్చుని సమయం వృథా చేసుకుంటున్నారనే తల్లిదండ్రులు నేడు అదే టీవీ ముందు కూర్చోబెట్టి మరీ తమ పిల్లలను చదువుకోమ్మని చెబుతున్నారు. ప్రిపరేషన్లో భాగంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కంప్యూటర్, ఫోన్లలో ఇంటర్నెట్ సాయంతో మాక్‌టెస్ట్‌లను కూడా రాస్తున్నారు. విద్యార్థులు సాంకేతికత సాయంతో స్మార్ట్ ప్రిపరేషన్‌కు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు.
ప్రిపరేషన్ సులభం..
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినందున ఇంటినుంచే పోటీ పరీక్షలకు సమయం వృథా కాకుండా సిద్ధమయ్యేందుకు ఎంతో సులభంగా ఉంటున్నందున, నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించేందుకు పెద్ద ఎత్తున ఇంటినుంచే ఆన్లైన్ తరగతుల ద్వారా ప్రిపేరయ్యే అవకాశముంది. ఇంతచక్కటి అవకాశాన్ని ఎంతోమంది విద్యార్థులు ఉపయోగించుకుని ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాలు సాధించేందుకు సులువుగా ఉంటుంది.
– మైలారం విజయ్‌కుమార్, విద్యార్థిసంఘం నాయకుడు
ఆన్లైన్ తరగతులతో మేలు
గతంలో ప్రైవేటు స్టడీసర్కిళ్లల్లో వేలరూపాయల ఖర్చు చేసి శిక్షణ తీసుకునేవాళ్లం. నాలుగునెలలపాటు ఇచ్చే ఈ శిక్షణలో వేలాది మంది విద్యార్థులకు ఒకేసారి బోధిస్తుండటంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. కాని నేడు ఆన్లైన్ తరగతులు, ప్రత్యేక అప్లికేషన్ల ద్వారా చదువుకునేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్రిపేరవుతుంటే ప్రపంచంలోని సమాచారమంతా మనదగ్గరే ఉన్నట్లుగా ఉంది. స్మార్ట్ప్రిపరేషన్ ద్వారా ప్రిపరేషన్ సాగిస్తూ ఉద్యోగంసాధించేందుకు కష్టపడుతున్నా.
– జాటోతు నవీన్, బండాలేమూర్