సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): చైనా నుంచి వచ్చే ఆదేశాలతోనే ఇక్కడ ఉండే లోన్‌యాప్ ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతున్నది. నిందితులను అరెస్టు చేసి.. విచారిస్తుండడంతో యాప్‌ల వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరనేది బయటపడుతున్నది. గతంలో భారీ ఎత్తున ఈ యాప్‌ల ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలిచ్చారు. చాలా మంది నుంచి వసూళ్లు కూడా చేశారు. మరికొందరు ఇంకా చెల్లించాల్సి ఉంది. బకాయిదారుల నుంచి ఎప్పటికప్పుడు తమ రుణాలు వసూలు చేసేందుకు యాప్ నిర్వాహకులు అప్పట్లో కాల్సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. వేధింపులు ఎక్కువ కావడం, అవి భరించలేక బాధితులు బలవన్మరణాలకు పాల్పడడంతో సిటీ పోలీసులు రుణ యాప్దారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. కాల్సెంటర్లను మూసేశారు.
ఈ క్రమంలోనే కొన్నాళ్లు విరామమిచ్చిన నిర్వాహకులు.. మూడు నెలల నుంచి తిరిగి రుణాలిచ్చి.. వసూళ్ల ప్రక్రియను మొదలుపెట్టారు. కొత్త వారికి రుణాలు ఇచ్చి వేధింపులతో పాటు డేటాబేస్‌ను ఆధారం చేసుకొని గతంలో లోన్ తీసుకొని కట్టవారి ఫోన్ నంబర్లు సేకరించి వారిని కూడా వేధిస్తున్నారు. ఎవరిని వేధించాలి..? వారి బంధువులు ఎవరు అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఇందుకు చైనీయులు రూపొందించిన డింగ్‌టాక్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. చైనీయులు, ఢిల్లీ, బీహర్ ప్రాంతాల్లో ఉండే ప్రధాన ఏజెంట్లకు లక్ష్యం ఇస్తే.. వీటికి తగ్గట్టుగా వర్క్‌ఫ్రమ్ హోం పేరుతో ఒంటరిగా ఉండే వాళ్లకు వసూలు చేసే బాధ్యత అప్పగిస్తున్నారు.
రోజు వారీగా లక్ష్యాలు ఇస్తూ..
గతంలో లాగా కాల్‌సెంటర్లు కాకుండా.. వర్క్ ఫ్రం హోం ఇచ్చి.. ఒక్కొక్కరికీ కొన్ని ఫోన్‌నంబర్లు ఇస్తూ రోజు వారీగా టార్గెట్లు ఇస్తున్నారు. టార్గెట్లు పొందిన వారు ఇండ్లలో నుంచి ఫోన్లు చేసి రుణాలు తీసుకున్న వారిని వేధిస్తున్నారు. ఇందులో కొందరు తమ సొంతంగా సేకరించిన బ్యాంకు ఖాతాల్లోకి బెదిరించి వసూలు చేసే డబ్బును డిపాజిట్ చేయిస్తున్నారు. అయితే పోలీసులకు పట్టుబడితే కూడా ఒక్కరే పట్టుబడుతారని, ఒకేసారి నెట్వర్క్ మాత్రం ధ్వంసం కాదనే ధీమాతో సైబర్‌నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వేధింపులు చేసి సేకరించిన డబ్బులో ఎప్పటికప్పుడు తమ కమీషన్లు మినహాయించుకొని మిగతా సొమ్మును ఆర్డర్లు ఇచ్చిన వారికి ఇస్తున్నారు. మరికొందరు మాత్రం తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బు పడగానే ఉడాయిస్తున్నట్లు సమాచారం. వర్క్‌ఫ్రమ్ హోంతో ఎవరికి వారే టార్గెట్లు ఇచ్చి పని చేయించుకోవడం వల్ల పోలీసులకు ఒక్కరో ఇద్దరో మాత్రమే దొరికే అవకాశాలుండడంతో యాప్‌ల నిర్వాహకులకు పని సులువుగా మారుతున్నది.