షాబాద్, జూన్ 19 : గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్‌ను తగ్గించడం, బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ)ఎంతో మంది పేద విద్యార్థినులకు వరంలా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తరుణంలో ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల మాదిరిగానే కస్తూర్బాగాంధీ(కేజీబీవీ) బాలికల విద్యాలయాల్లో కూడా ఇంగ్లిష్ మీడియాన్ని ఈ నెల 13 నుంచే అమలు చేస్తున్నది.
రంగారెడ్డిజిల్లాలో 20 కేజీబీవీ పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 5వేల మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది నుంచే 6, 7, 8 తరగతుల వారికి ఇంగ్లిష్ మీడియంలో బోధన చేస్తున్నారు. ఇందుకుగాను కేజీబీవీల్లో పనిచేస్తున్న సుమారు 500 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 1 నుంచి ఐదు రోజుల పాటు జిల్లాలోని హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా 8 కస్తూర్బా విద్యాలయాలను ఇంటర్ వరకు ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. దీంతో అదే విద్యాలయంలో ఇంటర్ పూర్తి చేసే అవకాశం కలుగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం చదువులకు నోచని గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారి కోసం ఆంగ్ల బోధనను అందుబాటులోకి తీసుకొచ్చింది. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతోపాటు కేజీబీవీల్లోనూ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడంతో ఐదు రోజుల పాటు కేజీబీవీల్లో పనిచేసే ఎస్వోలతో పాటు ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనపై ఉన్నతాధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు.
ఎనిమిది పాఠశాలలు అప్‌గ్రేడ్
జిల్లాలో 20 కేజీబీవీ పాఠశాలలు ఉండగా.. అందులో 8 పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడంతో ఇంటర్ వరకు తరగతులను పొడిగించారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, శంషాబాద్, ఫరూఖ్‌నగర్ కేజీబీవీ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లతో ఇంటర్ తరగతులు నిర్వహిస్తుండగా.. మహేశ్వరం, కందుకూరు, శంకర్పల్లి, కొందుర్గు, కేశంపేట పాఠశాలల్లో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూతో ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారు. కేజీబీవీల్లో ఇంటర్‌ను ప్రవేశపెట్టడంతో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థినులు ఇదే పాఠశాలల్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదివే అవకాశం కలుగుతున్నది. ఎంతోమంది పేద విద్యార్థులు పట్టణాల్లోకి వెళ్లి ఇంటర్ చదువుకోలేని, మధ్యలో మానేసేవారికి ఈ అవకాశం కలిసి వచ్చింది. గతేడాది పదో తరగతి, ఇంటర్లో కేజీబీవీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు.
అమలవుతున్న ఆంగ్ల బోధన: ఉషారాణి, కేజీబీవీ పాఠశాలల జిల్లా అధికారి
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మాదిరిగానే కేజీబీవీ పాఠశాలల్లోనూ ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియంలో 6, 7, 8 తరగతులకు బోధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 కేజీబీవీల్లో సుమారు 5వేల మంది వరకు విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. 8 పాఠశాలలు ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడనున్నది. ఆంగ్ల బోధనపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ కూడా పూర్తయింది. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతోపాటు మంచి భోజనం అందిస్తున్నాం.